
అసలు సమస్య!
డంపింగ్
యార్డులే
సాక్షిప్రతినిధి, వరంగల్:
గ్రేటర్ వరంగల్.. 407.77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సుమారు 11.15 లక్షలకు పెరిగిన జనాభా.. 2.26 లక్షలకు పైగా ఇళ్లు.. రోజు రోజుకూ పెరుగుతన్న నగర విస్తీర్ణంతో.. ‘చెత్త’సమస్య తీవ్రమవుతోంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్ల నుంచి నిత్యం 518.62 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడిచెత్త ఉత్పత్తి అవుతోంది. ఆ మేరకు చెత్తను నిల్వ చేయడానికిగానీ, బయో మైనింగ్ చేయడానికి అవకాశం లేకపోవడం నగరవాసులకు శాపంగా మారింది. రోజుకు టన్నుల కొద్దీ చెత్తను తరలించే అవకాశం ఉన్నా.. 54శాతం మాత్రమే తరలించిన చెత్తతో 32.14 ఎకరాల్లోని మడికొండ డంప్ యార్డు నిండిపోతున్నది. ఒక్కో కాలనీకి వారానికి రెండు లేదా మూడు సార్లే చెత్త వాహనాలు వెళ్తుండగా.. తరలించిన 54 శాతం పోను మిగిలిన 46 శాతం కాలనీలు, రోడ్లు, ఇళ్లమధ్యనే వేయాల్సిన పరిస్థితి ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
మూడు నెలలకే మూలన పడ్డ బయోమైనింగ్
నగరంలో వెలువడే చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు బయోమైనింగ్ ప్లాంట్‌ను మడికొండలో ఏర్పాటు చేశారు. రైతులనుంచి భూములను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2013లో మడికొండ, రాంపూర్ గ్రామాల మధ్య ఎత్తయిన ప్రదేశంలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. స్మార్ట్ సిటీ స్కీమ్‌లో భాగంగా రూ.37 కోట్లు కేటాయించి బయోమైనింగ్ పనులు చేపట్టారు. 2021లో మొదలైన చెత్త రీసైక్లింగ్ పనులు మూడు నెలలకే మూలన పడింది. దీంతో చెత్త సమస్య యథాతఽథంగా మారింది. పలుమార్లు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సందర్శించి త్వరితగతిన చెత్త బయో మైనింగ్ చేయాలని సూచించినా కదలికలేదు. ఫలితంగా ఏడు లక్షల టన్నులకు పైగా చేరిన చెత్తతో డంపింగ్ యార్డు నిండిపోయింది. చేసేదిలేక ఎప్పటికప్పుడు చెత్త నిల్వలు పెరిగిపోకుండా డంపుయార్డులోనే కాల్చివేసే ప్రయత్నం చేస్తుండగా ఆ పొగ, దుర్వాసనతో మడికొండ, రాంపూర్, ఎలుకుర్తిలతోపాటు చుట్టుపక్కల నివసించే ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు.
ఊసేలేని హుజూరాబాద్ డంపింగ్ యార్డు..
మడికొండకు ప్రత్యామ్నాయంగా కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని చెత్తను తరలించేందుకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొత్తపల్లి శివారులో స్థల పరిశీలన చేశారు. అక్కడ చెత్త రీసైక్లింగ్‌తోపాటు బయో మైనింగ్, 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే చెత్తను డంప్ చేసే యోచన చేశారు. ఇందుకోసం వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, హుస్నాబాద్, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీలనుంచి చెత్తను అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హజూరాబాద్ సమీ పం (కొత్తపల్లి శివారు)లో ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 25 ఎకరాల కేటాయింపు, ప్లాంట్ నిర్మాణం కోసం రూ.50 కోట్లు ఊసే లేకుండాపోయాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తారా.. లేదా చూడాలి.
గ్రేటర్ వరంగల్‌లో రోజుకు 518.62 మె.టన్నుల చెత్త
రోజూ 54శాతమే చెత్త సేకరణ,
తరలింపు..
మిగిలింది ఇళ్ల మధ్యన, వీధుల్లోనే..
మడికొండ డంపింగ్ యార్డులో
పేరుకు పోయిన నిల్వలు
హుజూరాబాద్ దగ్గర ప్రతిపాదనల్లోనే డంపింగ్ యార్డు
మూలన పడిన బయో మైనింగ్ ప్లాంట్.. ‘చెత్త’కు దొరకని పరిష్కారం..