
జిల్లా వ్యాప్తంగా వర్షం
హన్మకొండ: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్న క్రమంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొద్ది రోజులుగా వర్షాలు లేక తల్లడిల్లిన రైతాంగానికి ఈ వర్షం ఊరటనిచ్చింది. మెట్ట పంటలకు ఈ వాన జీవం పోసింది. ముందుగా విత్తనాలు వేసిన పంటలో కలుపు తీయడానికి అనుకూల వాతావరణం. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. జిల్లాలో సగటున 14.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భీమదేవరపల్లిలో 9.1 మిల్లీమీటర్లు, వేలేరులో 11.4, ఎల్కతుర్తిలో 12.7, కమలాపూర్‌లో 18.7, హసన్‌పర్తిలో 13.5, ధర్మసాగర్‌లో 10.9, కాజీపేటలో 15.4, హనుమకొండలో 13, ఐనవోలులో 18.5, పరకాలలో 8.3, దామెరలో 12.2, ఆత్మకూరులో 20.2, శాయంపేటలో 28.9, నడికూడలో 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
హనుమకొండ కాకాజీ కాలనీలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు