
నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : తాగునీటి నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని, ఇంజనీర్లు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఉర్సు కరీమాబాద్ వాటర్ ట్యాంక్‌ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరాలో సమయ పాలన పాటించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మేయర్ మాట్లాడుతూ ఉర్సు కరీమాబాద్ వాటర్ ట్యాంక్‌నుంచి పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోతున్నట్లు పెద్దఎత్తున ఫిర్యాదులు అందినట్లు మేయర్ తెలిపారు. వాల్వ్ లో సమస్య కారణంగా నీటి సరఫరా ఆగిపోయిందని ఏఈ సమాధానం ఇచ్చారు. నీటి సరఫరాలో ఏర్పడే సమస్యల పరిష్కార బాధ్యత ఏఈలు వర్క్ ఇన్‌స్పెక్టర్లదేనని అన్నారు.
యూజీడీ, ఎస్‌ఎఫ్‌టీల స్థలాల పరిశీలన
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటులో భాగంగా నిర్మించనున్న సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)లకు స్థలాలను శుక్రవారం మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 3వ డివిజన్‌లోని ఆరేపల్లిలోని వ్యవసాయ కళాశాల క్షేత్రం, 43వ డివిజన్ బొల్లికుంటలో ప్రభుత్వ స్థలాలను చూశారు. 66 డివిజన్‌లలో 11 జోన్లుగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డీపీఆర్‌లో పొందుపర్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 8 ఖరారు అయ్యాయని, మరో 3 ప్రాంతాలను గుర్తించాల్సి ఉందన్నారు.