
ఏనుమాముల మార్కెట్‌లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సూచనలిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్: ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ఆర్‌ఓలు షేక్ రిజ్వాన్ బాషా, అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఏనుమాముల మార్కెట్ యార్డులోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ అనంతరం నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాళ్లు పక్కపక్కనే ఉండేలా చూడాలన్నారు. ప్రతీ కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమష్టిగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ఆర్‌ఓలు సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. సిబ్బంది, ఏజెంట్లు, ప్రవేశం, బయటకు వెళ్లే దారులు వేర్వేరుగా బారికేడ్లతో ఉండాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండాలని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల సామగ్రి గది, ఈవీఎం కమిషన్ హాల్, కమ్యూనికేషన్ గది, అబ్జర్వర్ల గది, మీడియా సెంటర్ ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఆర్డీఓ వాసుచంద్ర, అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
శిక్షణతో భాషపై పట్టు
హన్మకొండ: శిక్షణతో భాషపై మరింత పట్టు వస్తుందని ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనర్ రామేశ్వర్‌గౌడ్ అన్నారు. ఎన్‌సీఆర్టీ సహకారంతో ‘విన్ టు కెన్’ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైదాబాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో 40 రోజుల ఉచిత శిక్షణ ఇచ్చారు. కాగా.. వీరికి శనివారం హనుమకొండలోని తారా గార్డెన్‌లో ఉపాధ్యాయులకు ఒక రోజు ఫిజికల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. విద్యార్థులను ఇంగ్లిష్‌లో ప్రావీణ్యులుగా తయారు చేయాలన్నారు. శిక్షణలో 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ట్రైనర్ రామేశ్వర్‌ను సన్మానించారు.