వైభవంగా ప్రసన్నాంజనేయ వ్రత మహోత్సవం
బెల్లంకొండ: బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హనుమత్ వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్రత మహోత్సవాల సందర్భంగా దేవదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. కార్తిక మాసంలో స్వామివారి దీక్షలను చేపట్టిన మాలధారులు మండల కాలం దీక్ష చేసి బుధవారం స్వామివారికి ఇరుముడులను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ చార్యులు, అనంతాచార్యులు వ్రత పూజల అనంతరం విశేష అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి సంకీర్తన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవో సనిమెళ్ల కోటిరెడ్డి, ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆసుల జగన్, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


