వైభవంగా పునీత శౌరి తిరునాళ్ల
ప్రత్తిపాడు: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులోని పునీత శౌరి తిరునాళ్ల మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. నవంబరు 24వ తేదీన జెండా ప్రతిష్టతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాలు బుధవారం రాత్రి జరిగిన సమిష్టి దివ్య పూజాబలితో ముగిశాయి. ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజాబలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్యతో పాటు ఆయా చర్చిల ఫాదర్లు, గురువులు హాజరై సమిష్టి పూజాబలిని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన విశ్వాసులు పుణ్యక్షేత్రం ఆవరణలో ఒత్తుల ప్రదక్షిణను దేవుని స్తుతిస్తూ చేపట్టారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లయబద్దంగా వాయిస్తున్న కళాకారుల విన్యాసాలు, కోలాట ప్రదర్శనలు, కర్ర సాములను తిలకించేందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. తిరునాళ్లకు గ్రామానికి విచ్చేసిన బంధువులతో ఊరంతా సందడితో కళకళలాడింది. రాత్రి పది గంటల సమయంలో పునీతశౌరి వారిని స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు. గీతాలాపనలు చేశారు. తేరు ప్రదక్షిణలో వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.
వైభవంగా పునీత శౌరి తిరునాళ్ల


