వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గుంటూరు బ్రాడీపేట 2వ లైన్‌లోని భవిత స్కూల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వివరించారు. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. చిన్నారులు ఆత్మనూన్యతాభావానికి గురికాకుండా చదువుపై శ్రద్ధ వహించి, పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులతో స్నేహభావంగా మెలిగి, ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం స్థానిక చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ప్యానెల్ అడ్వకేట్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ ఎన్.శ్రీనివాసరావు, రిసోర్స్‌పర్సన్ సువర్ణ లత, హెచ్‌ఎం ఎండీ అస్సన్ బేగ్, విద్యార్థులు పాల్గొన్నారు.


