దివ్యాంగ బాలల ఉన్నతికి వెన్నుదన్ను
నరసరావుపేట రూరల్: దివ్యాంగ బాలబాలికల ఉన్నతికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచేందుకు పథకాలు అమలు చేస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని నరసరావుపేటలోని భవిత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, సమీకృత విద్య కో– ఆర్టినేటర్ ఆర్.సెల్వరాజ్, నవభారత దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భవిత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్ట్, ఆయాల సేవలు మరువలేనివని తెలిపారు. దివ్యాంగుల ఉన్నతకి భవిత కేంద్రాలు మూల స్తంభాలని కొనియాడారు. అనంతరం దివ్యాంగుల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఓసీటీబీ పాఠశాల సెక్రటరీ నాయక్, ఫిజియోథెరపిస్ట్ పెదన్నారావు నాయక్, ఉపాధ్యాయులు కె.పద్మజ, జి.మేరీ కుమారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలి
ః సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు
దాచేపల్లి : మానసిక దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు తెలిపారు. నారాయణపురంలోని ఫాతిమా మాత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరిపి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులను అంతా గౌరవించాలని, సమాజంలో వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు షేక్ జానీ బాషా, మందపాటి శ్రీనివాసరెడ్డి, గురుప్రసాద్, వలంటీర్ అహ్మద్ పాల్గొన్నారు.
పల్నాడు డీఈఓ చంద్రకళ
దివ్యాంగ బాలల ఉన్నతికి వెన్నుదన్ను


