
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ?
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాంధీ
గురజాల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట సీఐ మాట్లాడిన మాటలు సరైనవి కావని ఖండించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణిని కూడా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఇబ్బందులు గురి చేస్తోందని ఆరోపించారు. సీఐ మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనీని కారులోంచి అక్రమంగా బలవంతంగా బయటకు నెట్టారని, ఆయనపై సీఎం, డెప్యూటీ సీఎంలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం కూటమి నాయకులు మానుకోవాలని, ప్రజలకు అభివృద్ధి పనులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో వారే బుద్ధి చెబుతారని కూటమి నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, జె. రమణ, నారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.