
నృసింహునికి లక్ష పుష్పార్చన
మంగళగిరి టౌన్ : స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన భక్తుల సమక్షంలో కనులవిందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గులాబి, చేమంతి, బంతి, మల్లెలు, తులసీ దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణ నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.