‘ఓడు’పోయిన మట్టి బతుకులు | - | Sakshi
Sakshi News home page

‘ఓడు’పోయిన మట్టి బతుకులు

May 11 2025 7:40 AM | Updated on May 11 2025 7:40 AM

‘ఓడు’

‘ఓడు’పోయిన మట్టి బతుకులు

తెనాలి: గుంటూరు జిల్లాలో పది గ్రామాల్లో 350 పైగా కుటుంబాలు వంశపారంపర్యంగా వస్తున్న మట్టి పాత్రల తయారీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. శలపాడు, గరువుపాలెం, కొలకలూరు, కావూరు, చింతాయపాలెం, మంగళగిరి, శృంగారపురం, తుమ్మలపాలెం, కొండవీడు, కోటప్పకొండ పరిసరాల్లో ఈ కుటుంబాలున్నాయి. పెళ్లిరోజున గరిక పాత్ర నుంచి పేదవాడి ఫ్రిజ్‌లుగా పిలుచుకునే కుండలు, కూజాలు, వంటపాత్రలు, పూలుకుండీలు, ప్రమిదెల సహా రకరకాల అవసరాల కోసం వాడే పాత్రల తయారీలో సిద్ధహస్తులు. ఏడాదిలో వేసవి కాలం మాత్రమే మట్టి పాత్రలకు గిరాకీ ఉంటుందని తెలిసిందే. మనిషి జీవితంలో ప్రవేశించిన ఆధునికత వీరి వృత్తికి కష్టకాలం తీసుకొచ్చి ంది. వేసవిలో అకాల వర్షాలు సంభవిస్తే వారి కష్టమంతా నీటిపాలవుతుంది. అన్నింటినీ భరిస్తూ కొనసాగిస్తున్న వారసత్వ చేతివృత్తిలో కళాత్మకత అబ్బురపరుస్తుంది.

దొరకని మట్టి

వృత్తికి ప్రధానమైన మట్టి లభ్యత సమస్యగా మారింది. ట్రక్కు రూ.5 వేలు పెట్టినా అనువైనది దొరకడం కష్టంగా ఉంది. వడ్లమూడి క్వారీ ఆపడంతో వీరికి నాణ్యమైన మట్టి కోసం పలుచోట్ల వెతుకులాట తప్పనిసరైంది. టన్ను పుల్లలు రూ.5 వేలు, పొలం పొట్టు రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.20 వేల వ్యయంతో ఏటా సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరులోపు అవసరమైనవి సమకూర్చుకుంటారు. ముందుగా మట్టిని ఎండబెట్టి, నలగ్గొట్టి, గాబులో పోసి వడపోసిన మట్టిని పాత్రల తయారీకి వినియోగిస్తారు. ఈ పనిలో ఇంటావిడ శ్రమిస్తే, మట్టిని అందమైన పాత్రలుగా మలచే పనిని ఇంటాయన చేస్తుంటారు.

ఇరుగుపొరుగు సాయంతో ఆము ఏర్పాటు

పదిహను, ఇరవై రోజులు మట్టి పాత్రలు చేశాక వాటిని ఎండలో ఆరబెడతారు. తర్వాత ఒకరోజు ఇరుగుపొరుగు సాయంతో ఆము పెట్టుకుంటారు. సాయంత్రం పూట ఏడెనిమిది మంది కలిసి రెండు గంటలసేపు శ్రమిస్తే గాని ఆము తయారుకాదు. పగిలిన కుండలను చుట్టూ పేర్చుకుని, వాటిపైన ఆరబెట్టిన కుండలను భద్రంగా అమర్చుకుంటూ, అయిదారు వరుసలతో అన్నింటినీ సర్దుతారు. పగిలిన కుండపెంకులతో పైన కప్పును రూపుదిద్దుతారు. దిగువన కట్టెపుల్లలు, పొలం పొట్టు, ఊక ఏర్పాటు చేస్తారు. కాల్చిన పిడకలను చుట్టూ ఖాళీల్లో సర్దుతారు. ఆ పిడకలు రగులుకొని, ఊక, పొలం పొట్టుతో సహా కట్టెపుల్లలను మండించి, లోపలున్న మట్టిపాత్రలను ఎర్రగా కాలుస్తాయి.

ఉదయాని కల్లా ‘రెడీ టు సేల్‌’

మట్టి పాత్రల తయారీలో సంప్రదాయ విధానాలకు మృణ్మయ కళాకారులు కూడా ఆధునిక సాంకేతికతను అందుకున్నారు. పాత్రల తయారీ కోసం ముందుగా మట్టిని కలిపి పాకంగా చేయాలి. గతంలో ఇందుకోసం గంటన్నరపాటు కాళ్లతో తొక్కేవారు. ఇప్పుడు పది నిముషాల్లోనే విద్యుత్‌ మిషను మట్టి పాకాన్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు చక్రంలాంటి సారైపె మట్టి ముద్ద తిరుగుతుంటే చేతితో అందమైన రూపంలో కుండను చేస్తారు. మధ్యమధ్యలో కర్రతో సారెను తిప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సారెను కర్రతో తిప్పే విధానానికి స్వస్తి పలికారు. విద్యుత్‌ మోటారుతో అవసరమైనంతసేపు తిరుగుతూనే వుంటోంది. దీనితో పాత్రల తయారీకి సమయం తగ్గింది. ప్రమిదెల తయారీకి సెరామిక్‌ బ్లాంకెట్‌ వాడుతున్నారు.

కుండలకు తగ్గిన గిరాకీ

ఎంత కళాత్మకంగా మట్టి పాత్రలు చేసినా మార్కెటింగ్‌లో నష్టపోతున్నామనే భావన వీరిలో ఉంది. అదేమంటే వినియోగదారులు ‘మట్టి కుండేగా’ అనేస్తున్నారని వృత్తిదారులు వాపోతున్నారు.

మట్టి కుండ తయారీకి సగటున రూ.70–80 ఖర్చయితే, వీరి నుంచి రూ.120 కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో అదే కుండను రూ.250లకు అమ్ముతున్నారు. తయారీదారుకు రూ.50 లోపు మిగిలితే మధ్య వ్యాపారికి రూ.100 పైగా లభిస్తోంది. ఫ్రిజ్‌ల కారణంగా కుండలకు గిరాకీ తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూలింగ్‌ క్యాన్లు వీరి వృత్తికి చేటు తెస్తున్నాయి. వేసవిలో విస్తృతంగా నడిచే చలివేంద్రాల్లో గతంలో కుండల స్థానంలో ఇప్పుడు కూలింగ్‌ వాటర్‌ క్యాన్లు వెలుస్తున్నాయి. ఈ క్యాన్ల నీటికన్నా కుండల నీరే శ్రేష్టమని తెలిసినా, అవే వాడుతున్నారు.

కడుపు నింపని చేతివృత్తి మృణ్మయ కళాకారుల జీవితం.. శ్రమకు దక్కని ఫలం మట్టికుండల చల్లదనం వెనుక శ్రామికుల స్వేదం కష్టాలను భరిస్తూ సంప్రదాయ చేతివృత్తిని కొనసాగిస్తున్న శాలివాహనులు

మట్టి పరిమళం వారికి జీవనశ్వాస...మట్టితో ముడిపడిన జీవితాలవి...తోటి మనుషులను నమ్మినా లేకున్నా మట్టిని ప్రేమిస్తారు. చేతివృత్తుల్లో ఒకటైన మట్టి పాత్రల తయారీలో ‘కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా’ అనుకుంటూ మమేకమైన దృశ్యం అక్కడ గోచరిస్తుంది. ఇంటిల్లిపాదికీ అది నిత్యం శ్రమైక జీవన సమరమే. వారు చిందించే స్వేదం నుంచే మట్టి కుండ రూపుదిద్దుకుని, అందులోని నీటి చల్లదనం దాహార్తులను సేదదీరుస్తుంది. మట్టికి అందమైన ఆకృతినివ్వగల ఆ మృణ్మయ కళాకారులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

‘ఓడు’పోయిన మట్టి బతుకులు 1
1/2

‘ఓడు’పోయిన మట్టి బతుకులు

‘ఓడు’పోయిన మట్టి బతుకులు 2
2/2

‘ఓడు’పోయిన మట్టి బతుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement