ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు ఏకరీతిన కొనసాగింది. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మరోవైపు ఆది దంపతులకు నిర్వహించిన పలు ఆర్జితసేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొనగా, అమ్మవారిని దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. భారీసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోగా వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన అధికారులు తగుచర్యలు చేపట్టారు. రికార్డుస్థాయిలో ఆదివారం ఒక్కరోజే సుమారు 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తుండగా, దేవస్థానానికి రూ. 41లక్షల ఆదాయం సమకూరింది. కేవలం టికెట్ల విక్రయాల ద్వారానే రూ.21లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. రూ.500 విలువగల వీఐపీ టికెట్లు 2,450, రూ.300 టికెట్లు 1,050, రూ.100 టికెట్లు 7050 విక్రయించారు. సర్వదర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ఉదయం ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్లమార్గంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఓ దశలో ఓం టర్నింగ్‌లోని రూ.300 టికెట్ కౌంటర్ వరకు సర్వదర్శనం క్యూలైన్ చేరింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.