Sakshi Guest Column Muslim Countries BJP Govt Nupur Sharma - Sakshi
Sakshi News home page

భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!

Jun 16 2022 12:40 AM | Updated on Jun 16 2022 6:09 PM

Sakshi Guest Coulmn Muslim countries BJP Govt Nupur Sharma

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న’ నానుడి అక్షరాలా నిజమని నూపుర్‌ శర్మ అనుచిత వ్యాఖ్యల ఉదంతం స్పష్టం చేస్తోంది. ఆమె నోటి దురుసు వల్ల ఇవ్వాళ భారతదేశం అనేక ముస్లిం దేశాల నుంచి తీవ్రమైన నిరసనలను ఎదుర్కోవలసివచ్చింది. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం తేవడం, హిందుత్వ వాదులు హిజాబ్‌ పేరుతో ముస్లిం అమ్మాయిలపైన వివక్షను ప్రదర్శించడం వంటి అనేక కారణాల వల్ల ఆయా దేశాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి వెళ్లగక్కడానికి ఈ వ్యాఖ్యలు తక్షణ కారణంగా పనిచేశాయి. ఈ ప్రపంచం చాలా చిన్నది. ఏ దేశం కూడా తనంతట తానుగా మనుగడ సాగించలేదు. అందుకే సహజీవనం, శాంతి, సామరస్య విధానాలు తప్పనిసరి.

‘‘ఎవరైనా తన మనసులో పెంచుకున్న ద్వేషం సహజంగా మనిషిలో ఉండే విచ క్షణను దెబ్బతీస్తుంది. తన మాటలు, చేతలు తన శత్రువు కన్నా తనకే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. అవి తన ఉనికికే ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. వ్యక్తుల స్థాయిని బట్టి దాని పరిణామాలు ఉంటాయి.’’ గౌతమబుద్ధుడు కోపం, ద్వేషం గురించి చేసిన చాలా బోధనలలో ఈ విషయాన్ని సుస్పష్టంగా వివరించారు.

సుత్తనిపాతంలోని కోకాలిక సుత్తం, అంగత్తర నికాయలోని ద్వేష సుత్తం, సంయుక్త నికాయలోని సుందరిక సుత్తంలో సోదాహరణంగా దీన్ని వివరించారు. మనుషుల్ని ప్రేమ, స్నేహం, కరుణల ద్వారా గెలుచుకోవాలేగానీ, ద్వేషంతో గెలవ లేరని కూడా బుద్ధుడు తన జీవితకాలంలో నిరూపించారు.     

ఇన్ని శతాబ్దాల తరువాత సరిగ్గా తథాగతుడి ఈ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమని రుజువవుతున్నది. ఇటీవల మహమ్మద్‌ ప్రవక్తపై భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు అటువంటి పరిస్థితులను సృష్టించాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని కాశీనగరంలో జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందన్న విషయంపై జరిగిన టెలివిజన్‌ చర్చలో నూపుర్‌ శర్మ ముస్లింల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడటం తీవ్ర వివాదానికి తెరతీసింది. భారత్‌లోని ముస్లింలకు సంబంధించిన ఏ వివాదంలోనూ తలదూర్చక సహనం వహించిన దేశాలు సైతం ఈ సందర్భంలో తమ అసంతృప్తిని విస్పష్టంగా వ్యక్తం చేశాయి. కొన్ని దేశాల్లో భారతదేశ వస్తువులను కొనరాదని తీర్మానించేలా వివాదం తారా స్థాయికి చేరింది. 

నిజానికి ఈ నిరసన ఈ సంఘటనతో బయటకు వచ్చినప్పటికీ, భారత దేశంలో మైనారిటీలపై, ప్రత్యేకించి ముస్లింలపై బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి ఇప్పటివరకూ జరిగిన అనేక ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలను తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. అయితే నూపుర్‌ ఉదంతంతో వాళ్ళ అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. అంతేకానీ ఇది ఈ ఒక్క సంఘటన ఫలితం కాదు. 

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత గోద్రా అల్లర్లు కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇక్కడ ఒక మతం, మరొక మతంపై ద్వేషాన్ని ప్రకటించడం కాదు. ఇది ఒక రాజకీయ వ్యూహం. మెజారిటీగా ఉన్న హిందువుల ఓట్లను గెలుచు కోవడానికీ, వాళ్ళను తమవైపు తిప్పుకోవడానికీ ముస్లింలపై ద్వేషాన్ని నూరిపోశారు.

ఇది ఉత్తర భారతదేశంలో చాలా విస్తృతంగా జరిగింది. ముస్లిం దండ యాత్రల వల్ల పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని ప్రజలు చరిత్రలో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత ఆ ‘చరిత్ర’ను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తుంది. అయోధ్య సమస్య ఇందుకు మంచి ఉదాహరణ.

మతం మనోభావాలకు సంబంధించిన సమస్య. గుజరాత్‌లో సైతం అటువంటి ప్రయత్నమే జరిగింది. హిందూ కులాల్లో ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి నిత్యం ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. గోసంరక్షణ, లవ్‌ జిహాద్‌ల పేరుతో చాలా చోట్ల భౌతిక దాడులు జరిగాయి. ఆవు మాంసం తిన్నాడనే నెపంతో అనేక దాడులు... చివరకు ప్రాణాలే తీసిన దారుణాలను ఈ దేశమే కాదు ప్రపంచ దేశాలూ ప్రత్యక్షంగా చూశాయి. 

కశ్మీర్‌ సమస్య పరిష్కారం పేరుతో 370 ఆర్టికల్‌ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, హిజాబ్‌ పేరుతో ముస్లిం అమ్మాయిలపైన వివక్షను ప్రదర్శించడం కూడా ముస్లింలను అభద్రతకు గురిచేసింది. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత దేశంలో ప్రజలకు మత పరమైన స్వేచ్ఛ లేకుండా పోయిందని అనుకునేట్టు చేశాయి. సరిగ్గా ఇదే నేపథ్యం నుంచి మనం ముస్లిం దేశాల, సంస్థల నిరసనను చూడాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం ప్రపంచంలోని ముస్లిం దేశాలు అనుసరించే వైఖరి భారత దేశ ఆర్థిక పురోగతిపై, రాజకీయ సుస్థిరతపై, సామాజిక సామరస్యంపై ప్రభావం చూపనున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలోని 50 దేశాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. దాదాపు 30 దేశాల్లో 90 శాతం ముస్లిం జనాభా ఉంది. 20 దేశాల్లో 50 శాతం పైగానే ముస్లిం జనాభా ఉంది.

మధ్య ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా లోని చాలా దేశాల్లో ముస్లిం ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నింటితో భారత దేశానికి మంచి ఆర్థిక సంబంధాలున్నాయి. అంతేకాకుండా కేవలం గల్ఫ్‌లో 89 లక్షల మంది భారతీయులు ఉపాధి, ఉద్యోగాలు కలిగి ఉన్నారు. వాళ్ళ బతుకు మీద, భద్రత మీద కూడా దీని ప్రభావం ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

ఒక నెల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు బీజేపీ దేశంలోని ముస్లింల పట్ల చూపుతున్న వ్యతిరేకత, ద్వేషం గల్ఫ్‌ లోని కార్మికులు, ఉద్యోగుల భద్రత మీద వ్యతిరేక ప్రభావం చూపు తుందని హెచ్చరించిన విషయంలో నూరు శాతం వాస్తవం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ గల్ఫ్‌ మీద అధికంగా ఆధారపడి ఉంది. పన్నెండు ముస్లిం దేశాలు భారతదేశం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి.

ఇందులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా లాంటి దేశాలున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌లోని ఆరు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఈ దేశాలకు చేస్తున్న ఎగుమతుల్లో బియ్యం, గేదె మాంసం, మసాలాలు, సముద్రపు ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, చక్కెర లాంటి ఉత్పత్తులు ముఖ్యమైనవి.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో భారత దేశానికి వ్యాపార సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, భారతదేశం వినియోగించే పెట్రోల్, డీజిల్, ఉత్ప త్తుల్లో 60 శాతం కేవలం గల్ఫ్‌ దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఈ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది.

అలాగే బీజేపీ దాని అనుబంధ సంస్థలూ, ఆ పార్టీ అధికారంలో ఉన్న చోట క్రైస్తవులపై కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. గత ఆరేడేళ్ళలో కొన్ని వేల క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి సేవాకార్యక్రమాల కోసం సేకరిస్తున్న నిధులను నిలిపివేశారు. కొన్ని వందల క్రైస్తవ మత బోధకులపై నిర్బంధాలు అమలయ్యాయి.

గల్ఫ్‌ మినహా క్రైస్తవ సమాజం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇతర మతాల పట్ల, అక్కడి ప్రజల పట్ల సామరస్య పూర్వకంగా వ్యవహరించకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమా దంలో పడే అవకాశాలున్నాయి. అంతే కాకుండా, అంతర్గతంగా అశాంతి పెరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది.

నూపుర్‌ శర్మ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివి. ఈ నేపథ్యంలో... ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ బద్ధంగా, సెక్యులర్‌ వ్యవస్థ రక్షణకు పూనుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించా లంటే మత సామరస్యం పాటించక తప్పదన్నది నిర్వివాదాంశం. అదే విషయాన్ని నూపుర్‌ వివాదం స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రపంచం చాలా చిన్నదన్న విషయం కూడా రుజువైంది.

ఏ దేశం కూడా తన సొంతంగా, తనంతట తానుగా మనుగడ సాగించలేదు. అందుకే పరస్పర సహకారం, సహజీవనం, శాంతి, సామరస్యం లాంటి విధానాలు అవసరమవుతున్నాయి. ఇటీవల ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ముస్లింలు ఈ దేశపు పౌరులే, వారిని ద్వేషించ కూడదని చెప్పిన మాటలు చేతల్లోకి రావాలి.









వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌: 81063 22077 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement