పని చేయాలన్నా బలం ఏది?

Sakshi Guest Column On Percentage Of Workers Employed In India

విశ్లేషణ

కార్మిక శక్తి నుంచి చాలామంది భారతీయులు వైదొలుగుతున్నారు. పని చేయగల వయసు వారిలో 46 శాతం మాత్రమే పనిచేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. కారణం ఏమిటి? పేదలకు అందుబాటులో ఉన్న పనులను వారు శారీరకంగా చేయగల స్థితిలో లేరు. నాలుగింట మూడొంతుల ఉపాధి వ్యవసాయం, నిర్మాణ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లించడం లేదు. పైగా రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచేస్తున్నాయి. దాంతో కఠిన శ్రమ చేయడానికి అవసరమైన పోషణ వీరికి అందడం లేదు. కాబట్టి వీరు పని నుండి తప్పుకొంటున్నారు. మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. ఇదొక విష వలయం!

పేద దేశాల ప్రజలు వేతన శ్రమ కోసం వేసారి పోతున్నారు. చట్టబద్ధంగా పనిచేయ గల 15 సంవత్సరాల వయసు రాకముందే వారు తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. తక్కువ ఆదాయాలు గల దేశాల్లోని పని చేయగల జనాభాలో సగటున 66 శాతం మంది పనిచేస్తున్నారనీ, లేదా పని చేయాలని అనుకుంటున్నారనీ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) చెప్పింది. అధికాదాయ దేశాల్లో ఈ నిష్పత్తి 60 శాతం ఉంది. పేద ప్రజలు ఏ వయసులో ఉన్నా వారు పనిచేయాల్సి ఉంటుందనేది అర్థం చేసుకోదగినదే. అదే సంపన్నుల విషయానికి వస్తే వయసు మీరగానే శ్రామిక శక్తి నుంచి తప్పుకోగలరు.

భారత్‌ విషయానికి వస్తే ఈ తర్కం మారిపోతుంది. భారతీయ శ్రామిక జనాభాలోని 46 శాతం మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారు. ఇవి ఐఎల్‌ఓ గణాంకాలు. అదే సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) నుంచి మీరు గణాం కాలు తీసుకున్నట్లయితే, అవి షాక్‌ కలిగిస్తాయి. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్‌–19 మహమ్మారి మనపై దాడి చేయకముందు భార తీయ శ్రామిక జనాభాలో 44 శాతం మాత్రమే పని చేయాలను కుంటున్నారని ఈ డేటా చెప్పింది. 2022 అక్టోబర్‌ నాటికి ఇది 40 శాతానికి పడిపోయింది. అంటే పనిచేసే వయసు విభాగంలోకి వచ్చిన భారతీయుల్లో 60 శాతం మందికి పనిలేదు లేదా వారు పనిచేయాలని కోరుకోవడం లేదు.

దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, పని చేయగల వయసులో ఉన్న భారతీయ మహిళల్లో కొద్దిమంది మాత్రమే డబ్బు వచ్చే పని చేయగలుగుతున్నారు. 1990 నుంచి 2006 మధ్య కాలంలోని ఐఎల్‌ఓ డేటా 32 శాతం మహిళలు మాత్రమే శ్రామిక శక్తిలో పాల్గొంటున్నా రనీ, వీరు డబ్బు వచ్చే పని చేస్తుండటం లేదా అలాంటి పని చేయాలనుకుంటున్నారనీ చెబుతోంది. అదే 2019 నాటికి ఇది 22 శాతానికి పడిపోయింది. ఇక సిఎంఐఈ డేటా మరింత నిరాశాజనక మైన విషయాన్ని బయటపెట్టింది. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్‌ లాక్‌డౌన్లు రాకముందు పనిచేయగల వయసులో ఉన్న 12 శాతం మహిళలు మాత్రమే దేశంలో పనిచేస్తున్నారు లేదా పని చేయాలను కుంటున్నారు. 2022 అక్టోబర్‌ నాటికి ఇలాంటి వారి సంఖ్య 10 శాతానికి పడిపోయింది. అదే చైనాతో పోల్చి చూసినట్లయితే పనిచేసే వయసు ఉన్న 69 శాతం మంది మహిళలు అక్కడ కార్మిక శక్తిలో పాల్గొంటున్నారు. 

భారతదేశంలో అధోగతిలో ఉన్న మహిళా కార్మికశక్తి భాగస్వామ్య రేటు, పెరుగుతున్న మన ఐశ్వర్యంతో పోలిస్తే అనుషంగిక నష్టంలా కనిపిస్తోందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ఇంటి బయట మహిళలు పనిచేయడం అంటేనే భారతీయులు మొహం చిట్లించుకుంటారు. కానీ డబ్బుకు కటకట అవుతున్న పరిస్థితుల్లో వారికి అంతకు మించిన అవకాశం మరొకటి లేదు. భారతీయులు రానురానూ దారిద్య్రం నుంచి బయటపడుతున్న కొద్దీ వారి మహిళలు  పనిచేయడం ఆపివేసి ఇళ్లకు మరలిపోతున్నారు. ఐశ్వర్యం అనేది పేదలను కూడా సంస్కృతీ కరణ ప్రభావానికి గురి చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పేదలు కూడా ఆదాయ నిచ్చెన పైకి ఎక్కుతున్న కొద్దీ మహిళల పట్ల సాంప్రదాయిక భావజాలం వైపు వెళ్లిపోతున్నారు.

సౌకర్యంగానే ఉందనిపిస్తున్న ఈ ధోరణిలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి: 2005–06లో కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం గుర్తించదగినంత అధికంగా ఉన్నప్పుడు కూడా పిరమిడ్‌ దిగువ భాగంలో ఉన్న భారతీయ గృహాలు సంపన్నంగా మారాయనడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు. రెండు: కొద్దిమంది మహిళలు మాత్రమే వేతనం వచ్చే పనిని కోరుకుంటున్నారని అనుకుంటే, వారు సుల భంగా ఉద్యోగం సంపాదించగలగాలి. కానీ వాస్తవం దానికి వ్యతి రేకంగా ఉంది. దేశంలో పురుషుల నిరుద్యోగితా రేటు 8.6 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగితా రేటు మూడు రెట్లకంటే ఎక్కువగా 30 శాతం ఉందని సీఎంఐఈ అక్టోబర్‌ నెలకు ప్రకటించిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీని అర్థమేమిటంటే, భారత దేశంలో ప్రతి 100 మంది శ్రామిక మహిళల్లో 10 మంది మాత్రమే పనికోసం చూస్తున్నారు. ఇందులోనూ ఏడుగురికి మాత్రమే డబ్బు వచ్చే పని దొరుకుతోందన్నమాట.

మరి 2019లో మగవారి పరిస్థితి ఏమిటి? కోవిడ్‌కి ముందు, పనిచేసే వయసులోని భారతీయ పురుషుల్లో 73 శాతం మంది కార్మిక శక్తిలో పాల్గొనేవారని అంతర్జాతీయ కార్మిక సంస్థల లెక్కలు సూచిం చాయి. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లోని 74 శాతంతో పోలిస్తే ఇది కాసింత తక్కువే. 2019 మధ్యలో పురుషుల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు గురించిన సీఎంఐఈ డేటా ప్రకారం కూడా ఇది 72 నుంచి 73 శాతం మధ్య ఉంటోంది. ఇది 2022 అక్టోబర్‌ నాటికి 66 శాతానికి పడిపోయింది.

2020 ఫిబ్రవరి నుంచి (కోవిడ్‌ లాక్‌డౌన్లకు ముందు) 2022 అక్టోబర్‌ మధ్యనాటికి భారత్‌లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అదే స్థాయిలో ఉండివుంటే, మరో 3.3 కోట్లమంది పురుషులు కొత్తగా పని కోసం వెదుకుతూ ఉండాలి. కానీ ఈ సంఖ్య 13 లక్షలకు మాత్రమే పెరిగింది. ఫలితంగా 3.2 కోట్లమంది  పనేచేసే వయసులోని పురు షులు కార్మిక శక్తి నుంచి వైదొలిగారు.

దీనికి సంబంధించిన సమగ్ర వివరణ ఏదంటే, భారతదేశంలోని పేదలకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల తీరు చూస్తే వారు శారీరకంగా పనిచేయగల స్థితిలో లేరు. దేశంలోని అన్ని ఉద్యోగాల్లో నాలుగింట మూడొంతులు వ్యవసాయం, నిర్మాణరంగ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లిం చడం లేదు. వీటిలో రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచే స్తున్నాయి. ఎనిమిది గంటలు పనిచేసే రైతు 4,500 కేలరీలను నష్ట పోతుంటారనీ, అదే సమయం పనిచేసే నిర్మాణ కార్మికుడు 4,000 కేలరీలను కోల్పోతుంటాడనీ యూరప్‌ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో నిర్మాణ రంగం మరింత తీవ్ర శ్రమతో కూడుకున్నది కాబట్టి దీనికి మరింత శక్తి అవసరం. 
దాదాపు 16 శాతం భారతీయులు పోషకాహార లేమితో ఉన్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) అంచనా.

అంటే పని చేయగలిగే జనాభాలోని పేద ప్రజల్లో అధిక భాగం కఠిన శ్రమ చేయడానికి అవస రమైన కేలరీలలో సగం కూడా పొందలేదని దీని అర్థం. వారు రేషన్లు, ప్రభుత్వం అందించే ఉచితాలు, తమ గ్రామ కమ్యూనిటీ అందించే మద్దతుతో మనగలుగుతున్నారు. ఇదొక విష వలయం. ప్రభుత్వ రేషన్లు నిశ్చల జీవితానికి మద్దతు ఇచ్చేంతగా మాత్రమే పనికొస్తాయి. పేదలు తమ ప్రస్తుత పోషకాహార స్థాయికి తగిన పనులు పొందలేరు. కాబట్టి వారికి మరొక దారి  లేదు. అందుకే మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు.

మనం స్వాతంత్య్రం పొందినప్పుడు భారత్‌ ఊహించిన పంథాకు ఇది పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. కఠిన శ్రమ నుంచి పరిశ్ర మల్లోని యాంత్రిక శ్రమ వైపు కార్మికులను తరలించడానికి బదులుగా ఈరోజు అత్యంత కఠినమైన పనితో కూడిన ఉపాధి అవకాశాలు మాత్రమే దొరుకుతున్నాయి. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏదంటే– ప్రభుత్వం తక్షణ లాభాలను త్యాగం చేసి అధిక ఉద్యోగావకాశాలు, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధిని కల్పించే యాంత్రీకరణ వైపు మరలడమే. ఇది జరగనంతవరకూ భారత్‌ తన ప్రజల్లో మెజారిటీకి కేవలం జీవనాధార ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోతుంది.


అనింద్యో చక్రవర్తి, వ్యాసకర్త సీనియర్‌ ఆర్థిక విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top