
వరి సాగులో బాతుల వాడకం ఇటీవలి ఆవిష్కరణ కాదు. భారత్, థాయిలాండ్ సహా అనేక ఆసియా దేశాల్లో ఇది అనాదిగా సాగుతున్న ఒక సాంప్రదాయ పద్ధతి. బాతులు తమ పొలాల్లో తిరుగుతూ ఉండటం వల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను రైతులు గ్రహించారు. సాధారణంగా వరి పంట కోసిన తర్వాత పొలాల్లో బాతులను వదులుతారు. పంట మోళ్లు, కీటకాలు, కలుపు మొక్కలన్నిటినీ బాతులు తినేస్తాయి. పురుగులు, కలుపు మొక్కలను తినడం ద్వారా ఆ తర్వాత వేసే పంటకు చీడపీడల బెడద చాలా వరకు తగ్గించడానికి బాతులు సహాయపడుతున్నట్లు కేరళతో పాటు థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఆ విషయాలను కొంచెం విపులంగా తెలుసుకుందాం..!
వరి సాగు చేసే రైతులు, బాతులను పెంచే రైతులకు మధ్య పరస్పరాధారిత అనుబంధానికి బాతులు దోహదం చేస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయంలో బాతులకుప్రాధాన్యం ఉంది. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతిలో వరి పొలాల్లో ముఖ్యంగా వరి కోతల తర్వాత బాతులు తిరుగాడుతుంటాయి. ఇలా అనేక వారాల పాటు తిరుగుతూ పురుగూ పుట్ర, కలుపు, పురుగులను తింటాయి. ఇది తదుపరి వేసే వరి పంటకు బలాన్నిస్తాయి. అంతేకాదు, జీవవైవిధ్యం ఇనుమడించడానికీ ప్రయోజనం చేకూరుస్తుంది. బాతులు తెగుళ్ళు, కలుపు మొక్కలను అదుపు చేయటడంలో సహాయపడతాయి. బాతులు పొలాల్లో తిరిగే సమయాల్లో అవి విసర్జించే రెట్ట నేలను నత్రజని తదితర సహజపోషకాలతో సారవంతం చేస్తుంది.
ఈ పద్ధతి ముఖ్యంగా కేరళలోని త్రిస్సూర్ లోతట్టుప్రాంత చిత్తడి భూముల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. వలస పక్షుల ఆవాసాలుగా కూడా దోహదపడే ఈ చిత్తడి నేలలు వరి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందటమే కాకుండా పరిరక్షించదగిన చిత్తడి నేలలుగా రామ్సర్ అంతర్జాతీయ ఒడంబడిక గుర్తింపు పొందాయి కూడా.
వరి పొలాల్లో బాతులతో కూడిన సుస్థిరమైన వ్యవసాయ పద్ధతి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతోంది:
తెగుళ్లు– కలుపు నియంత్రణ: వరి పొలాల్లో కోతల తర్వాత రాలిపోయిన ధాన్యాలు, కలుపు మొక్కలు, కీటకాలను బాతులు తింటాయి. సహజంగా వీటిని అదుపు చేయటం వల్ల రసాయన పురుగుమందులు, కలుపు మందుల అవసరం తగ్గుతుంది. అదేవిధంగా, ఆ తర్వాత సీజన్‌లో వరి నాట్లు వేసిన తర్వాత కూడా కొద్ది కాలం పాటు బాతులు లేత వరి పొలంలోకి ప్రవేశపెడతారు. కలుపు మొక్కల్ని తినెయ్యటంతో పాటు నేలను గోళ్లతో తిరగేస్తాయి. పురుగూ పుట్ర దొరుకుతాయోమోనని వెదికే క్రమంలో ఇది జరుగుతుంది. అది కూడా పంట మొక్కల వేర్లకు గాలి తగిలేలా చేసి వాటి పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో పాటు రైతులు చల్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపటానికి కూడా వీటి పనులు ఉపయోగపడతాయి.
ఎరువు: బాతుల రెట్ట సహజ ఎరువుగా పనిచేస్తుంది. రెట్టలోని నత్రజని నేలను సుసంపన్నం చేస్తుంది.
జీవవైవిధ్యం: పొలాల్లో జీవవైవిధ్యం పెరుగుతుంది. ముఖ్యంగా త్రిస్సూర్ చిత్తడి భూముల్లో వలస పక్షుల సందడికి బాతుల ప్రభావం ఉంది. ఈ విధంగా విభిన్న పర్యావరణ వ్యవస్థ విరాజిల్లుతూ ఉంటుంది.
సమాజ సహకారం: బాతులు.. వరి వ్యవసాయ ప్రక్రియలో కీలక పాత్రపోషిస్తాయి.
సాంప్రదాయ పద్ధతి: సమగ్ర వరి సాగు – బాతుల పెంపకం పద్ధతి కేరళలో చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇది వ్యవసాయానికి పర్యావరణపరంగా సుస్థిరతను చేకూర్చి ప్రకృతికి చేరువ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులకుప్రాధాన్యం పెరుగుతున్న ఈ దశలో బాతులను అనుసంధానం చేయటం వల్ల వ్యవసాయం ఎలా సంపన్నమవుతుందో అందౖరూ గుర్తిస్తున్నారు.
థాయిలాండ్ పొలాల్లోనూ బాతుల సేనలు
థాయిలాండ్‌లో ఒక ప్రత్యేకమైన, సుస్థిర వ్యవసాయ పద్ధతి దృష్టిని ఆకర్షిస్తోంది. రైతులు తమ వరి పొలాలను సమర్థవంతంగా నిర్వహించడానికి బాతుల సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. వరి కోసిన తర్వాత, ఈ రెక్కలుగల కార్మికులను పొలాల్లోకి విడుదల చేస్తారు. అక్కడ మిగిలిపోయిన పురుగులు, కలుపు మొక్కలు, కుళ్ళిపోతున్న మొక్కల పదార్థాలను తింటాయి. ఈ పద్ధతి రసాయన పురుగుమందుల అవసరాన్ని తగ్గించడమే కాకుండా నేల సారాన్ని, పంట దిగుబడిని పెంచడానికి కూడా దోహదం చేస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.
వరి సాగులో బాతుల వాడకం పద్ధతి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి పర్యావరణంపై దాని సానుకూల ప్రభావం. రసాయన పురుగుమందులు, కలుపు మందులతో చేసే పనులను బాతులతో భర్తీ చేయడం ద్వారా రైతులు అటువంటి రసాయనాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. బాతులు సర్వభక్షకులు కావడంతో, హానికరమైన పురుగులను తినడమే కాకుండా, పొలాల్లో జీవవైవిధ్యాన్ని ్రపోత్సహించడం ద్వారా పర్యావరణ వ్యవస్థ మెరుగుదలకు కూడా దోహదం చేస్తాయి. అదనంగా, వాటి విసర్జితాలు సహజ ఎరువుగా పనిచేస్తుంది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను చూపే కత్రిమ ఎరువుల అవసరం లేకుండా నేలను సుసంపన్నం చేస్తుంది.
బాతులను వరి పొలాల్లోకి ప్రవేశపెట్టడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నేలను కదిలించటం వల్ల నేలలోకి గాలి ప్రసరణ పెరిగి వరి మొక్కల వేర్లు అభివృద్ధిని పెంచుతుంది. ఇంకా, బాతుల ఉనికి పర్యావరణ వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది పంటల మెరుగైన పెరుగుదలకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ పద్ధతి ఫలితంగా రసాయన ఎరువులు లేదా పురుగుమందులు వంటి అదనపు ఉత్పాదకాల అవసరం తగ్గింది. తగ్గిన ఖర్చులు, పెరిగిన దిగుబడితో బాతుల సహాయక వ్యవసాయం చాలా మంది రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా మారుతోందని థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన పెరుగుతూనే ఉండటంతో, థాయిలాండ్‌లో ఎక్కువ మంది రైతులు బాతుల పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోని ఇతరప్రాంతాల్లోనూ అనుసరించదగిన ఇటువంటి పర్యావరణహితమైన వ్యవసాయ పద్ధతులను ్రపోత్సహించడానికి స్థానిక సమాజం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థలు ఆసక్తి చూపుతుండటం విశేషం. థాయ్ రైతులు తమ పొలాల్లో బాతులను చేర్చడం ద్వారా వ్యవసాయం, సహజ పర్యావరణం మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతున్నారు.
ఇండోనేషియాలోనూ...
ఇండోనేషియాలోని దక్షిణ సులవేసిలో సంచార బాతుల మందల పెంపకం కోసం వరి పొలాలను ఉపయోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణ సులవేసిప్రావిన్స్లోని వరి పొలాల్లో బాతులను మేపే 3ప్రాంతాల్లో పరిశోధన చేశారు. నేల భౌతిక, రసాయన లక్షణాలు, బాతుల మేత, ్రపోటీన్ కంటెంట్ మొత్తాన్ని లెక్కించడం, బాతుల సంఖ్య తదితర అంశాలను విశ్లేషించి సానుకూల ఫలితాలు ఉన్నట్లు తేల్చారు.