దసరా సెలవుల్లో ..తొమ్మిది పనికొచ్చే పనులతో ఎంజాయ్‌ చేయండిలా.. | Parenting Tips: How you spent your Dasara Holidays | Sakshi
Sakshi News home page

దసరా సెలవుల్లో ..తొమ్మిది పనికొచ్చే పనులతో ఎంజాయ్‌ చేయండిలా..

Oct 14 2026 5:47 PM | Updated on Oct 14 2026 5:54 PM

Parenting Tips: How you spent your Dasara Holidays

దసరా సెలవులు వచ్చేశాయి. పూర్తిగా ఎంజాయ్‌ చేయాల్సిన టైమ్‌ ఇది. ఎంజాయ్‌ చేద్దాం. అల్లరి చేద్దాం. ఆడదాం పాడదాం. కాని ఈ నవ రాత్రుల రోజుల్లో కనీసం 9 మంచి పనులు పనికొచ్చే పనులు కూడా చేద్దాం. అప్పుడు సెలవుల్లో ఎంజాయ్‌ చేసినట్టు ఉంటుందీ సెలవులు ముగిశాక ‘ఇదిగో ఈ పనులు చేశాం’ అని స్కూల్లో గర్వంగా చెప్పుకునే వీలూ ఉంటుంది. సరే. ఏంటా పనులు?

1. ‘విత్తన బాంబులు’ విసిరేద్దాం
ఈ సెలవుల్లో వీడియో గేమ్‌లో విలన్లను చంపడం కాదు.. రియల్‌ లైఫ్‌లో పర్యావరణాన్ని కాపాడే సూపర్‌ హీరోలా మారుదాం. కొంచెం మట్టి, కంపోస్ట్‌ ఎరువు కలిపి, అందులో చింతగింజలు, మునగ లేదా వేప విత్తనాలు పెట్టి చిన్న చిన్న లడ్డూల్లా చుట్టండి. వీటిని ‘సీడ్‌ బాల్స్‌’ అంటారు. ఎండబెట్టిన తర్వాత, మీరు ఊరికి వెళ్లే దారి లో లేదా ఖాళీ ప్రదేశాల్లో వీటిని విసిరేయండి. వచ్చే వర్షాకాలానికి అవి అందమైన చెట్లుగా మొలకెత్తుతాయి. పచ్చటి ప్రకృతిని సృష్టించిన క్రెడిట్‌ మీ ఖాతాలో పడుతుంది!

2. ఫోన్‌ని జైల్‌లో వేయండి
సెలవుల్లో ఏదో ఒక రోజు మీ ఇంట్లోని పెద్దవాళ్లతో ఒక క్రేజీ బెట్‌ కట్టండి. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లో ఎవ్వరూ స్మార్ట్‌ఫోన్‌ ముట్టుకోకూడదు, టీవీ చూడకూడదు. ఆ టైమ్‌లో దాగుడు మూతలు, చెస్, ట్రేడ్, క్యారమ్స్‌ వంటి ఇండోర్‌ ఆటలు ఆడండి. ఫోన్‌ స్క్రీన్‌ చూడకుండా రోజంతా ఎంతలా ఎంజాయ్‌ చేయవచ్చో మీ పేరెంట్స్‌కు ప్రాక్టికల్‌గా చూపిస్తూ షాక్‌ ఇవ్వండి.

3. వాయిస్‌ ఆఫ్‌ గ్రాండ్‌పేరెంట్స్‌
తాతయ్య, నానమ్మ లేదా అమ్మమ్మల దగ్గర బోలెడన్ని కబుర్లు, కథలు ఉంటాయి. వాళ్లతో కూర్చుని కాసేపు ముచ్చటించండి. వాళ్లు చిన్నప్పుడు ఆడిన చిత్రమైన ఆటలు, తిన్న చిరుతిళ్లు, వాళ్ల చిన్ననాటి అల్లరి విశేషాలను మీ ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేయండి. వాళ్ల పాత జ్ఞాపకాలను ఒక చిన్న ‘ఆడియో బుక్‌’ లాగా మార్చండి. ఇది మీ ఫ్యామిలీకి ఒక లైఫ్‌టైమ్‌ మెమొరీగా మిగిలి΄ోతుంది.

4. కిచెన్‌లో ‘ఫైర్‌లెస్‌’ మ్యాజిక్‌!
ఈరోజు అమ్మకు వంటగదిలో రెస్ట్‌ ఇచ్చి, మీరే షెఫ్‌ టోపీ పెట్టుకోండి. స్టవ్‌ వెలిగించకుండా మీ చేతులతోనే టేస్టీ అండ్‌ హెల్తీ ఫుడ్‌ తయారు చేద్దాం. మొలకెత్తిన గింజలతో ప్రోటీన్‌ చాట్, పండ్ల ముక్కలతో కలర్‌ఫుల్‌ ఫ్రూట్‌ సలాడ్‌ లేదా చీజ్‌ బ్రెడ్‌ శాండ్‌విచ్‌ చేసి ఇంట్లో వాళ్లకు సర్వ్‌ చేయండి. మీలో ఎంత మంచి కుకింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయో చూసి ఇంట్లో వాళ్లంతా మెచ్చుకోవాల్సిందే!

5. ‘లిటిల్‌ బర్డ్స్‌’ వాటర్‌ బ్యాంక్‌!
ఎల్‌నినో ఎండల తీవ్రతకు పక్షులు దాహంతో అల్లాడిపోతుంటాయి. ఇంట్లో ఉండే పాత మట్టి మూకుడు లేదా వెడల్పాటి ప్లాస్టిక్‌ డబ్బాను శుభ్రం చేసి, అందులో నీళ్లు నింపి మీ ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌ పైన పెట్టండి. కుదిరితే పక్కనే కొన్ని గింజలు చల్లండి. రోజూ ఉదయాన్నే ఆ నీటిని మార్చడం ఒక అలవాటుగా చేసుకోండి. దాహం తీర్చుకోవడానికి వచ్చే పక్షుల కిలకిలరావాలు మీ ఉదయాన్ని ఎంతో హ్యాపీగా మారుస్తాయి.

6. వేస్ట్‌ నుంచి బెస్ట్‌ క్రాఫ్ట్‌
పాత న్యూస్‌ పేపర్లు, ΄్లాస్టిక్‌ బాటిళ్లు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, కార్డ్‌బోర్డ్‌ బాక్సులను సేకరించండి. యూ ట్యూబ్‌లో చూసి వాటితో పెన్‌స్టాండ్‌లు, పేపర్‌ బ్యాగ్స్, పిగ్గీ బ్యాంకులు లేదా దసరా బతుకమ్మ బొమ్మలు తయారు చేయండి. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి, మన ఇంట్లోని వేస్ట్‌ను బెస్ట్‌గా ఎలా మార్చవచ్చో మీ ఫ్రెండ్స్‌కు చూపించి ఇన్‌స్పైర్‌ చేయండి.

7. ‘సీక్రెట్‌ మనీ బ్యాంక్‌’
దసరా పండుగకు చుట్టాలు, పెద్దవాళ్లు మీకు ఇచ్చే ‘దసరా ఖర్చుల’ డబ్బులను ఒక చిన్న మట్టి హుండీ కొని, ఆ డబ్బునంతా అందులో దాచడం అలవాటు చేసుకోండి. సెలవులయ్యాక ఆ పొదుపు చేసిన డబ్బుతో మీకు కావలసిన మంచి స్టోరీ బుక్స్, ఇన్ఫర్మేటివ్‌ గేమింగ్‌ కిట్స్‌ లేదా డ్రాయింగ్‌ సెట్‌ కొనుక్కోండి. పొదుపులో ఉన్న కిక్‌ మీకే తెలుస్తుంది.

8. డొనేషన్‌ డ్రైవ్‌!
మీ బట్టల అల్మారాను సర్ది చిన్నవై΄ోయిన, చిరిగిపోకుండా మంచి కండిషన్‌లో ఉన్న బట్టలు, మీ పాత పుస్తకాలు,  పక్కన పడేసిన టాయ్స్‌ను వేరు చేయండి. వాటిని నీట్‌గా ప్యాక్‌ చేసి, మీ పేరెంట్స్‌ సహాయంతో రోడ్డు పక్కన ఉండే పేదపిల్లలకు కాన్కగా ఇవ్వండి. వారి మొహంలో నవ్వును చూడటం కంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు.

9. నా డైరీ – నా దసరా జ్ఞాపకం
ఇది మీ ఫైనల్‌ టాస్క్‌. ఒక సరికొత్త వైట్‌ నోట్‌బుక్‌ తీసుకోండి. ఈ సెలవుల్లో మీరు పైన చెప్పిన పనులలో ఏమేం చేశారో, ఎక్కడెక్కడికి తిరిగారో రోజువారీగా అందులో డైరీ రూపంలో రాయండి. కుదిరితే మీరు చేసిన పనుల ఫోటోలు తీసి, ప్రింట్‌ తీయించి ఆ బుక్‌లో అంటించండి. మీ చేతిరాతతో ఒక వండర్‌ఫుల్‌ మెమొరీ బుక్‌ రెడీ అవుతుంది. దానిమీద ... సమ్మర్, దసరా సెలవుల్లో నా డైరీ అని అందంగా రాసి దాచుకోండి. ఏ ఇరవై ముప్పై ఏళ్ల తర్వాతో చూస్తే థ్రిల్‌ ఫీలవుతారు.

స్కూల్‌ తెరిచాక మీ క్లాస్‌మేట్స్‌ అందరూ ఫోన్‌గేమ్స్‌లో ఏ లెవెల్‌కి వెళ్లారో మాట్లాడుతుంటే మీరు మాత్రం సమాజానికి ఉపయోగపడే, మీ క్రియేటివిటీని పెంచే పనులు ఎలా చేశారో సగర్వంగా చెప్పవచ్చు. లీడర్‌ అంటే అందరిలా వెనకాల నడిచేవాడు కాదు.. అందరికంటే భిన్నంగా ఆలోచించి ముందు నిలబడేవాడు. సో... సెలవుల్లో గ్యాడ్జెట్స్‌ పక్కన పెట్టి, క్రియేటివిటీతో దూసుకు΄ోదామా? హ్యాపీ అండ్‌ సేఫ్‌ దసరా!.

ఇదీ చదవండి: క‘లిపి’ నేర్చుకుందాం..! ఆడుతూ..ఇతిహాసాలు వినేద్దాం ఇలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement