Sparsh Hospice: దేవతల్లాగే కనిపించారు.. వాళ్ల నవ్వు అద్భుతం!

International Women Day 2022: Sparsh Hospice Service To Needy - Sakshi

సేవామూర్తులు

బిడ్డను పొత్తిళ్లలో చూసుకున్నంతటి ప్రేమను కుటుంబం అంతా పంచుతుంది మహిళ.  జీవితం చివరి దశలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రేమ కూడా అమ్మ సొంతమే అని హైదరాబాద్‌లోని స్పర్శ్‌ హాస్పిస్‌ స్పష్టం చేస్తుంది. ఇంటి బాధ్యతల్లోనూ, చదువుల్లోనూ మునిగి ఉండే మహిళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవ సేవయే మాధవ సేవగా భావించడానికి కదులుతోంది. 

జీవితం నేర్పిన అనుభవాల పాఠాలను మూటగట్టుకొని సేద తీరుతున్న చివరి దశ ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పక వచ్చి చేరే దశను కుటుంబం అంతా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో అది ఆ కుటుంబానికి కష్టంగా మారచ్చు. వృద్ధాప్యంతోనూ, జబ్బుతోనూ ఉండే చివరి దశను గౌరవంగా, ప్రేమగా, బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది.

ఒకోసారి కుటుంబంలో ఇది అన్నివేళలా కుదరని పరిస్థితి ఉండచ్చు. అలాంటప్పుడు స్పర్శ్‌ లాంటి కేంద్రాల్లో సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. సమాజ బాధ్యతల్లో తామూ ‘సేవ’లో పాలుపంచుకోవచ్చు అనే వారి సంఖ్య పెరుగుతోంది.

దీంట్లో మరీ ముఖ్యంగా తమ ఇంటి పరిధులను దాటి సేవలో భాగం పంచుకుంటోంది మహిళ. ‘ఇదో అనిర్వచనీయమైన అనుభూతి. ప్రతిఫలం ఏమీ ఆశించని సేవ ఇంతకు మించి ఉండదు. మన అమ్మానాన్నలకు సేవ చేసుకున్నట్టే’ అంటున్నారు స్వచ్ఛంద సేవికలు. 

వాళ్ల నవ్వు అద్భుతం..
సైకాలజీ అండ్‌ ఫిలాసఫీ లో డిగ్రీ సెకండియర్‌ చేస్తున్నాను. నా ఫ్రెండ్‌ శోభ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు నేను స్పర్శ్‌ సెంటర్‌కి వెళ్లాను. తన ద్వారా ఇలాంటి ఒక సేవ ఉంటుందని తెలిసింది. అక్కడ అందరూ చాలా సహనంగా ఉండటం కనిపించింది. సేవ పొందుతున్న చివరిదశలో ఉన్నవారు దేవతల్లాగే కనిపించారు. భవిష్యత్తును చాలా పాజిటివ్‌గా చూస్తారు వాళ్లంతా.

నాకు అది చాలా నచ్చింది. వారానికి ఒకసారి వెళ్లి అక్కడ వాళ్లతో మాట్లాడి వస్తుంటాను. వాళ్లే చాలా ధైర్యంగా ఉంటారు. నాకు భవిష్యత్తు గురించి మంచి విషయాలు చెబుతుంటారు. శారీరకంగా బెడ్‌ మీద నుంచి కూడా లేవడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ, వాళ్లలో ఒక మంచి నవ్వు ఉంటుంది. వారిలో ఆ నవ్వు చూడటానికి వెళుతుంటాను. 
– మహిక, స్టూడెంట్‌

ప్రతిఫలం ఆశించకూడదు..
మా నాన్నగారు క్యాన్సర్‌తో చనిపోవడంతో నా ఆలోచన సేవ వైపుగా మళ్లింది. క్యాన్సర్‌ పేషెంట్‌కు ఎలాంటి సేవ అందించాలనే విషయంలో చాలా తపన పడ్డాను. చివరి దశలో ఉన్న వాళ్లకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. మా వారి ఫ్రెండ్‌ ద్వారా స్పర్శలో సేవ చేసే అవకాశం లభించింది. స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఆ అనుభూతిని స్వయంగా పొందాను.

చివరి దశలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వాలి. వండాలి, తినిపించాలి. మందులు వేయాలి. మాట్లాడాలి. ప్రతిదీ వారికి దగ్గరగా ఉండాలి. అదంతా ఒక అసాధారణమైన అనుభూతి. డబ్బు ఒక్కటే కాదు మనసు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏమీ ఆశించని ప్రేమ ఇవ్వడం అనేది చాలా గొప్ప. పాతికేళ్లపాటు గృహిణిగా ఉన్న నేను, సేవ ద్వారా చాలా మందికి చేరువయ్యాను.

బయటకు వచ్చి సమాజ బాధ్యతలో మరొక ప్రపంచాన్ని చూశాను. బాధలో ఉన్నవారికి ‘నేనున్నాను’ అని ధైర్యం ఇవ్వడమనేది చాలా ముఖ్యం. ఏమీ ఆశించకుండా చేసినప్పుడే మనం చేసిన సేవకు సార్థకత ఉంటుందని అభిప్రాయం. 
– పద్మారెడ్డి, బిజినెస్‌ ఉమన్‌

అవగాహనే ప్రధానం
చివరిదశలో ఉన్నవారికి సేవ చేసుకునే భాగ్యం నాలుగేళ్లుగా నాకు లభించింది. చాలా మందికి ఈ చివరి దశలో ఉన్న సెంటర్‌ గురించి తెలియదు. చివరి దశలో ఉన్నవారిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు.

డాక్యుమెంటేషన్, సోషల్‌ మీడియా, డోనర్‌ రిపోర్ట్‌ను స్వచ్ఛందంగా చేస్తుంటాను. నాకు తెలిసిన వారందరికీ మానవ సేవలో ఉన్న గొప్పదనాన్ని గురించి చెబుతుంటాను. ఈ దశలో ఉన్నవారిని ఎలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలో తెలుస్తుంది. 
– నేహారాణి పటేల్, ఉద్యోగి

సేవాగుణానికి నైపుణ్యం తోడు..
విద్యాసంబంధ సంస్థలతో కలిసి వర్క్‌ చేస్తుంటాను. ఒకరి ద్వారా తెలిసి స్పర్శ్‌ కేంద్రాన్ని విజిట్‌ చేశాను. ముఖ్యంగా సేవాగుణం ఉండటంతో పాటు నైపుణ్యం గల వాళ్లతో మాట్లాడి ఇలాంటి సేవ గురించి పరిచయం చేస్తాను. డాక్టర్ల దగ్గరకు చివరి దశలో ఉన్న పేషెంట్స్‌ వస్తుంటారు.

అలాంటి వారికి సేవ అందించడానికి ఈ సెంటర్‌కి తీసుకువస్తుంటాను. అలాగే ఆన్‌లైన్‌ మ్యాగజైన్స్, డాక్యుమెంటరీ, వీడియో, సోషల్‌ మీడియాలో పబ్లిష్‌ చేయడం.. వంటివి చేస్తుంటాను. దీని ద్వారా మరికొందరికి ఈ సర్వీస్‌ అందేలా చూస్తాను.  
– అన్నపూర్ణ, సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రైనర్‌

చదవండి: Women's Day 2022: విజయవంతంగా 25 ఏళ్లు.. రూ. 20 సభ్యత్వంతో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top