Vandana Shiva: ప్రకృతి రక్షకు స్త్రీ శక్తి..

Environmental Activist Vandana Shiva Special interview - Sakshi

వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి పెరిగిందా?! 
మనం ఎలా ఉండాలో.. ఏం తినాలో..  
ఎలా జీవించాలో.. మార్కెట్‌ శక్తులు మనపైన పనిచేస్తున్నాయా?! 
పర్యావరణవేత్త, రచయిత, వక్త, సామాజిక కార్యకర్త అయిన 
డాక్టర్‌ వందనశివ డెహ్రాడూన్‌ నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని 
హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, పరిణామాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ   

మన దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. సేంద్రీయ ఆహార ఉద్యమంలో మార్గదర్శకులుగా ఉన్న మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తారు?  
ఇది మంచి పరిణామం. అయితే, మన మూలాలను మర్చిపోయి చాలా ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మళ్లీ మూలాలను వెతుక్కుంటూ వెళుతున్నాం. ఎవరు ఎంత సంపాదించినా ఆరోగ్యకరమైన జీవనం కోసమే కదా. మంచి ఆహారం వల్లే ఇది సాధ్యమని మనందరికీ తెలుసు. హరిత విప్లవంలో భాగంగా 1984లో వ్యవసాయ రంగంపై దృష్టిసారించినప్పుడు రసాయనాల వాడకం అంతగా లేదన్నది నిజం, కానీ, ఆ తర్వాత సంభవించిన పరిణామాలతో వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల జీవ వైవిధ్యం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చాయి.

ఇటీవల కాలంలో దేశంలో క్యాన్సర్‌ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతోందో మనకు తెలిసిందే. దీనితోపాటు పరిశ్రమల్లో తయారయ్యే ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ప్రజలపై మరీ హానికరమైన ప్రభావం చూపుతోంది. వేగంగా విజృంభించిన వ్యాధుల్లో డయాబెటిస్‌ కూడా ఒకటి. ఒక దేశ స్థితి అక్కడి వాతావరణం, ప్రజల ఆదాయం, ఆరోగ్యం.. ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. నేటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులన్నీ మన దగ్గర 10 వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి.

నీటి సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా దక్కన్‌ ఏరియా వ్యవసాయం నుంచి మిగతా రంగాలకు వలసపోయింది. ఇప్పుడిప్పుడు ఇతర రంగాల్లో ఉన్నవారూ వ్యవసాయరంగం వైపు చూస్తున్నారు. మనిషికి కావల్సింది ఆరోగ్యకరమై ఆహారం. దానిని తనే స్వయంగా పండించుకోవాలనే ఆలోచన పెరగడం శుభపరిమాణం. 

 ప్రస్తుతం మార్కెట్‌ను సేంద్రీయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పులు చేసిన ఆహార ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి కదా... ఇవి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి?  
నేను అర్థం చేసుకున్నదేంటంటే.. క్వాంటమ్‌ థియరీ ప్రకారం ప్రతీదానికి ఒక జెనోమ్‌ ఉంటుంది. ఉదాహరణకు మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక సంపూర్ణత్వం ఉంటుంది. ఏ ఒక్క భాగానికి విఘాతం కలిగినా మిగతా వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. అలాగే, జీవరాశి కూడా. ప్రపంచ మార్కెట్‌ను చూస్తే కార్న్, కనోలా, కాటన్, సోయా.. ఈ ఉత్పత్తులే. ఆహారం పైనే కాదు జీవనశైలిపైనా విపరీతమైన ప్రభావం చూపాయి.

మన దేశంలో బీటీ పత్తి అతి పెద్ద డిజాస్టర్‌ అని చెప్పవచ్చు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణలో పత్తి పంట కారణంగా రైతుల ఆత్మహత్యలు చూశాం. ఆ సమయంలో రైతు ఆత్మహత్యలకు గల కారణాలేంటో తెలుసుకోవడానికి వరంగల్‌తో పాటు మిగతా ప్రాంతాలకూ వెళ్లాను. మొత్తం రసాయనాలే. అమెరికాలో అక్కడి వ్యవసాయం దాదాపు రైతుల చేతుల్లోనే ఉంటుంది. కానీ, మన దగ్గర అలా లేదు. జన్యుపరమైన మార్పుల వల్ల జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడింది. పంట దిగుబడి పెరగడానికి అవలంబించే విధానాల వల్ల నిరంతర హాని జరుగుతూనే ఉంది.  

ఈ ప్రభావం నుంచి జీవవైవిధ్యాన్ని కాపాడాలంటే ఏం చేయాలి?     
దేశీ విత్తనాలు. ఇప్పుడు రైతులు వేసే విత్తనాలన్నీ బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కెమికల్‌ సీడ్స్‌. ముందు దేశీ విత్తనాలు రావాలి. కమ్యూనిటీ సీడ్‌ బ్యాంక్స్‌ పెరగాలి. విత్తనం గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రియల్‌ సీడ్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు అని గుర్తించాలి. మన ప్రాంత వాతావరణానికి అవి ఏ మాత్రం అనువైనవి కావు. దేశీ విత్తనాల అభివృద్ధిలో భాగంలో దేశవ్యాప్తంగా 150 కమ్యూనిటీ సీడ్‌ బ్యాంక్స్‌ ఏర్పాటు చేశాం. నాలుగు వేల వరివంగడాలు, 300 రకాల గోధుమ, మిల్లెట్స్‌.. దేశీ విత్తనాలలో పెద్ద మార్పు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం.

ఎందుకంటే, ఆహారమే అతి పెద్ద ఆయుధం. దానిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసుండాలి.. మనం తినే తిండి, విత్తనాన్ని మనకు మనంగా సాధించుకోవాలి. గ్రీన్‌ రెవల్యూషన్‌ రావాలి. ఇండస్ట్రియల్‌ ఫార్మింగ్‌ తగ్గాలి. ప్రభుత్వాలు స్థానికంగా రైతుల మార్కెట్లు ఏర్పాటు చేయాలి. ఎవరు పండిస్తున్నారో వారే అమ్ముకోగలగాలి. అంతేకాదు, వాటిని ఆ కుటుంబం కూడా తినగలగాలి.  

 ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనారోగ్యకరమైన వంటనూనెలకు గాంధీజీ సూచించిన కట్టెగానుగ నూనె సరైన పరిష్కారమా?  
కచ్చితంగా! గానుగ నూనెలు, మిల్లు నూనెలను చూస్తే మనకే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది వేటిలో పోషకాలు ఉన్నాయి అనేది. సత్యాగ్రహకాలంలోనే గానుగ నూనె ల ప్రాధాన్యం గురించి గాంధీజీ సూచించారు. దీనిని కూడా మార్కెట్‌ శక్తులు మనపై పనిచేశాయి. విదేశీ కంపెనీలు మన గానుగ నూనెలు మంచివి కావని, ఫిల్టర్, పోషకాలు కలిసిన నూనెలు మంచివని నూరిపోశారు. తమ ఆదాయాలు పెంచుకోవడానికి పరిశ్రమలు వేసిన ఎత్తుగడలకు మనం బలయ్యాం. దానిని మనం గుర్తించాలి.  

 మీ ‘నవధాన్య’ కేంద్రం ఏర్పాటు గురించి.. 
ప్రాంతాలవారీగా ఉన్న జీవరాశి అక్కడి వాతావరణ స్థితిగతులపైన ఆధారపడి మనుగడ సాగిస్తుంది. దేశంలోనే ప్రాంతాలవారీగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట దిగుబడులను చూస్తుంటాం. వాటి మీద ఒక మనిషి మాత్రమే కాదు, అక్కడ ఉన్న సమస్త జీవరాశి మనుగడసాగిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ శక్తుల కారణంగా మన దేశీయ జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం నెలకొంది. మనవైన వేప, బాస్మతి, వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు పెత్తనం చెలాయించాలని చూశాయి. వాటి హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటాల ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇవన్నీ గమనించే ‘నవధాన్య’ కేంద్రం ద్వారా దేశీ విత్తనాల పెంపునకు కృషి జరుగుతోంది.

మీకు ఇష్టమైన ‘ఎకోఫెమినిజం’ గురించి. ప్రపంచంలో ఈ భావన ఎలా ఉంది? 
వ్యవసాయంలో ఏ ఇజం ఉండదనేదే నా అభిప్రాయం. అయితే, మనం భూమిని తల్లిగా భావిస్తాం. వందల ఏళ్ల క్రితం నుంచి మహిళ ఇలాంటి పనులను చేయలేరు అనే ఒక విధానం మన వ్యవస్థలో ఉండేది. ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ రెండింటినీ విడదీయలేం. శక్తి చూపడంలో స్త్రీ అన్నింటా ముందుంటుంది. పైగా పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ రక్షగా ఉండే స్త్రీ, ప్రకృతిలోని జీవరాశిని కాపాడటంలోనూ ముందుంటుంది. అందుకే సేంద్రీయ వ్యవసాయంలో మహిళ చాలా బాగా వర్క్‌ చేస్తోంది. ప్రకృతిలో జీవించే హక్కు, తనకు, కావల్సినవి సాధించుకునే శక్తి అన్ని జీవులకు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా ఆహారం, వ్యవసాయం రంగాల్లో మహిళల శాతం అధికంగా ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 
– నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top