
నష్టాల ఊబిలో మామిడి రైతు
నూజివీడు: లాభాలు పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న మామిడి రైతుకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మామిడి కాపు తగ్గిపోయినప్పటికీ మార్కెట్‌లో ధర ఏమాత్రం పెరగకుండా పడిపోవడంతో రైతులకు ఆదాయం లేక నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నా ఏటా మామిడి పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఎకరాకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన మామిడి రైతులు పెట్టుబడులు కూడా రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. మామిడి సీజన్‌లో మామిడి ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా దారుణంగా పతనమవ్వడంతో రైతులకు కోత కూలి, కిరాయి రాని పరిస్థితుల్లో కొందరు రైతులు చెట్లకే కాయలు వదిలేశారు. దీంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మామిడి మార్కెట్‌ను కమిషన్ వ్యాపారులు, కాయలను కొనుగోలు చేసే ఢిల్లీ వ్యాపారులు కలిసి తమ గుప్పెట్లో ఉంచుకోవడంతో మామిడికి ధర లేకుండా పోతోంది. దీంతో మామిడి ధర రోజురోజుకు దిగజారుతుందే తప్ప ఒక్క రూపాయి కూడా పెరగడం లేదు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉందే తప్ప గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయింది.
జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి
ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. నూజివీడు డివిజన్‌లోనే దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బంగినపల్లి, తోతాపురి, రసాలను రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కాపు బాగా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ధర బాగా లభిస్తుందని రైతులు ఆశించగా ధర లేక వారి ఆశలు అడియాశలయ్యాయి.
ఇతర పంటల సాగు వైపు దృష్టి
ఒకప్పుడు మామిడి తోటలే జీవనాధారంగా ఉన్న నూజివీడు డివిజన్‌లో నేడు మామిడి తోటలంటే అయిష్టత కనబరుస్తున్నారు. మామిడి తోటలలో తెగుళ్ల ఉధృతి పెరగడం, సస్యరక్షణ చర్యలు చేపట్టినా నివారణ అంతంత మాత్రంగానే ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మామిడి ఎగుమతులు క్షీణిస్తూ ఉండటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి కాయలను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ సరైన ధర లభించకపోగా రైతులు దోపిడీకి గురవుతున్నారు. ధర ఉన్నా లేకపోయినా మామిడి కాయలను రైతులు ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో మామిడి సాగు తలకు మించిన భారంగా పరిణమించింది. గతంలో రైతులు తమకున్న మామిడితోటల నుంచి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు. నేడు ఆ పరిస్థితులు కనుమరగయ్యాయి. మామిడితోటలు తొలగించిన తరువాత సారవంతమైన భూముల్లో స్వల్పకాలిక పంటలను సాగుచేయడం ద్వారా మామిడిలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చనే ఆలోచనకు రైతులు వచ్చారు. గత రెండేళ్ల కాలంలో తోటలను నరికివేసిన భూముల్లో మొక్కజొన్న, పత్తి, మిరప, నాటు పొగాకుతో పాటు వేరుశనగ, కూరగాయలు తదితర పంటలను సాగుచేస్తున్నారు. మరికొందరైతే ఆయిల్‌పామ్ సాగువైపు వెళ్తున్నారు.
ఖర్చులు రావడం లేదు
మామిడి ధరలు దారుణంగా పడిపోయాయి. కోత కోస్తే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పడిపోయినప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహ రిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే మామిడి సాగు పట్ల రైతుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. నూజివీడు ప్రాంతంలో మామిడి పంట కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురవుతాయి.
– శీలం రాము, నూజివీడు
ఈ ఏడాది పతనమైన మామిడి ధరలు
కోత ఖర్చులు రాక చెట్లకే కాయలు వదిలేసిన రైతులు
మామిడి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పట్టించుకోని ప్రభుత్వం
ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న మామిడిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రులు, ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పడం తప్పితే మామిడి రైతును ఆదుకున్న దాఖలాలు లేవు. మామిడికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మామిడి మార్కెట్‌లో ధరలు పెరిగేలా ఎంత మాత్రం చర్యలు చేపట్ట లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.
మామిడి ధరలు (టన్ను సగటు ధర)
రకం గతేడాది ఈ ఏడాది
బంగినపల్లి రూ.30 వేలు రూ.12వేలు
తోతాపురి రూ.15 వేలు రూ.4 వేలు
బంగినపల్లికి దక్కని ధర
బంగినపల్లి రకం కాయలకు ప్రారంభంలో టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర లభించింది. సీజన్ గడిచిన కొద్దీ ధర తగ్గుముఖం పట్టి సీజన్ ముగిసే సమయానికి టన్ను రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది. దీంతో కోత కూలి, కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితి. అయినప్పటికీ కాయలను అలాగే ఉంచి చూస్తూ ఊరుకోలేక ఎంతో కొంత డబ్బులు వస్తాయనే ఆశతో కాయలు కోసి మార్కెట్‌కు తరలించారు.
తోతాపురి పరిస్థితి దారుణం
తోతాపురి(కలెక్టర్) రకానికి కూడా ఈ ఏడాది ధర లేదు. గతేడాది సీజన్ ముగిసే వరకు టన్ను ధర రూ.9 వేలకు పైగానే లభించగా ఈ ఏడాది మాత్రం టన్ను ధర రూ.3 వేలకు పడిపోయింది. మామిడి సేఠ్‌ల సిండికేట్, చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు తెరవక కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తోతాపురి ధరలు పతనమయ్యాయి. టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత కూలి, కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు తోతాపురి కాయలను చెట్లకే వదిలేశారు.

నష్టాల ఊబిలో మామిడి రైతు