ఆహ్లాదభరితం.. గోదావరి విహారం | Sakshi
Sakshi News home page

ఆహ్లాదభరితం.. గోదావరి విహారం

Published Mon, Nov 27 2023 1:16 AM

- - Sakshi

బుట్టాయగూడెం: ఒక పక్క గోదావరి గలగలలు... మరో పక్క గిరిజన గ్రామాల అందాలు.. ఆహ్లాదభరితం పాపికొండల విహారం. లాంచీల్లో గోదావరి నదిపై విహరిస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించే అనుభూతి మాటల్లో చెబితే చాలదు. గోదావరి నదిపై ప్రయాణించి ఆ అనుభూతిని పొందాల్సిందే.

ఎత్తయిన కొండల మధ్య ప్రయాణం

గోదావరి నదిలో పాపికొండల యాత్ర మధురానుభూతిని మిగులుస్తుంది. ప్రకృతి రమణీయమైన సోయగాలతో ఎత్తయిన కొండల మధ్య గలగలా ప్రవహించే గోదావరి అలలపై బోటు ప్రయాణం ఎంతో హాయినిస్తుంది. సెలవులు వస్తే పాపికొండలను సందర్శించేందుకు ఉత్సాహం కనబరిచేవారు ఎంతోమంది ఉన్నారు. కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల విహారయాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీరప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

పాపికొండల్లో ప్రయాణానికి లాంచీ పాయింట్లు

పాపికొండల విహారయాత్రకు వెళ్ళాలంటే రాజమండ్రి మీదుగా అల్లూరి జిల్లా దేవీపట్నం గండిపోచమ్మ గుడి సమీపంలోని లాంచీ పాయింట్‌ ఉంది. గండిపోచమ్మ తల్లి లాంచీ పాయింట్‌ నుంచి పేరంటాలపల్లి వరకూ సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. లాంచీల్లో ప్రకృతి రమణీయమైన దృశ్యాలను తిలకిస్తూ సుమారు 2 గంటల పాటు ప్రయాణం చేయాలి. ప్రస్తుతం ఇక్కడ టూరిజంకు చెందిన బోటు ఒకటి, ప్రైవేటు బోట్లను పాపికొండల విహారయాత్రకు వెళ్ళే వారి కోసం ఏర్పాటు చేశారు.

గోదావరిలో ప్రమాదకర ప్రాంతాలు

దేవీపట్నం, పాపికొండల నడుమ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గోదావరి ఎప్పుడూ సుడులు తిరుగుతూ ఉంటుంది. ఏలూరు జిల్లా వాడపల్లి, అల్లూరి జిల్లా మంటూరు వద్ద నదిలో అధికంగా సుడులు తిరుగుతూ ఉంటాయి. అయితే కచ్చులూరు మందం సమీపంలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంటాయి. ఆ ప్రదేశంలో నదికి ఇరువైపులా కొండలు ఉండి ప్రవాహం ఎక్కువగా ఉండటమే ఈ సుడులకు కారణమని పలువురు చెబుతున్నారు.

గోదావరి నదిపై ప్రయాణిస్తున్న బోటు

భద్రతా చర్యలు చేపట్టిన ప్రభుత్వం

గోదావరి నదిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. గతంలో కచ్చులూరు వద్ద బోర్డు ప్రమాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పటిష్టమైన చర్యలతో పాపికొండల ప్రయాణానికి భద్రత కల్పించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఏడాది కూడా పాపికొండల విహారానికి అనుమతినిచ్చింది. ప్రతి బోటులో లైఫ్‌ జాకెట్లతో పాటు లైఫ్‌ బోయా, ఆక్సిజన్‌ సిలిండర్‌లు, ఫైర్‌ జాకెట్‌లు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు, పర్యాటకుల ప్రాణాలకు రక్షణ కల్పించేలా రెవెన్యూ, పోలీసు, టూరిజం, ఇరిగేషన్‌ సిబ్బంది పర్యవేక్షణలో లాంచీ పర్యటన సాగేలా నిబంధనలు కఠినతరం చేసింది. లైఫ్‌ జాకెట్‌లు తప్పనిసరిగా ధరించడంతోపాటు లైఫ్‌ బాయ్‌లు, ఫైర్‌ అలారం, శాటిలైట్‌ ఫోన్‌లు, వాకీటాకీలను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్ళతో లైఫ్‌ బోట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. లాంచీల నాణ్యతను పరిశీలించేందుకు నిరంతరం ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు.

మధురానుభూతి కలిగించే పాపికొండల యాత్ర

బోటు ప్రయాణానికి పెరుగుతున్న యాత్రికుల సంఖ్య

Advertisement
 

తప్పక చదవండి

Advertisement