మనసున మల్లెల మాలలూగెనే!

sakshi editorial on Spring summer - Sakshi

వసంత గ్రీష్మాలు వేసవికాలం. నింగిలోని సూర్యుడు నిప్పులు చెరిగే కాలం. ఇది ప్రకృతిలోని ఒక పార్శ్వం మాత్రమే! మండుటెండల ధాటికి అల్లాడిపోయే ప్రాణికోటి తాపోపశమనానికి తగిన వెసులుబాట్లను కూడా ప్రకృతి ఏర్పాటు చేసే ఉంచింది. ఏటా వేసవిలోనే నోరూరించే మామిడి పండ్లు విరివిగా పండుతాయి. వేసవిలోనే మల్లెలు విరగబూస్తాయి. వేసవులే లేకపోతే, మామిళ్ల మాధుర్యం, మనసుదోచే మల్లెల పరిమళం మనకు దక్కేవేనా? మల్లెలు, మామిళ్ల కోసమైనా ఏటా వేసవులు రావాల్సిందే! మన సాహిత్యంలో ఎందరెందరో కవులు మల్లెల సౌరభాన్ని వెదజల్లారు.

‘మెండు మీఱిన పతగ బీఱెండ దాకి/ యొల్లబోయిన లేబొండుమల్లెపొదల/ తుదల జప్పటలై కడుదొడ్డ లగుచు/ బొడమ మొగ్గలగము లగ్గిబొబ్బలట్లు’ అని శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్త మాల్యద’ కావ్యంలో వర్ణించాడు. మండువేసవి వేడికి బొండుమల్లెల పొదల చివుళ్లు వాడి అణగి పోయి ఉంటే, వాటి మధ్య పెద్ద పెద్ద మల్లె మొగ్గలు అగ్గిబొబ్బల్లా కనిపించాయట! వేసవిలో ఒంటి మీద పుట్టే సెగ్గడ్డలు ఎవరికైనా అగ్గిబొబ్బల్లానే కనిపిస్తాయి. రాయలవారికి మాత్రం వాడిన చివుళ్ల మధ్యనున్న బొండుమల్లెల మొగ్గలు అగ్గిబొబ్బల్లా కనిపించడం విచిత్రం కాదు, ఆయన వర్ణనా వైదుష్యానికి నిదర్శనం కూడా! 

రాయలవారి కంటే ముందు పోతనామాత్యుడు కూడా తన కవిత్వంలో మల్లెలను ప్రస్తావించాడు. ‘నల్లనివాడు పద్మనయనమ్ములవాడు... మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ! చెప్పరే!’ అంటూ గోపికలు నల్లనయ్య జాడ కోసం మల్లెలను ఆరాతీశారట! వాటి పొదల మాటునే ఆ నల్లనివాడు నక్కి ఉంటాడని వాళ్ల అనుమానం పాపం! మన పదకవితా పితామహుడు అన్నమయ్య కూడా శ్రీనివాసుని తలపులతో ఉన్న శ్రీదేవి విరహాన్ని మల్లెలతో పోల్చాడు. ‘పొలతి జవ్వనమున బూవక పూచె/ యెలమి నిందుకు మనమేమి సేసేదో’ అనే కీర్తనలో ‘సతి చింతా లతలలో సంపెంగపూవులు పూచె/ మతి విరహపు మేన మల్లెలు పూచె’ అన్నాడు. శ్రీనివాసుని తలపులతోనున్న శ్రీదేవి ఆలోచనల్లో తొలుత సంపెంగలు పూచాయట! మదిలో విరహతాపం మొదలైనప్పుడు మల్లెలు పూచాయట! 

వేసవి వేడిని చవిచూసే ప్రతిదేశంలోనూ మల్లెలు పూస్తాయి. మన దేశం నలుచెరగులా మల్లెలు ప్రతి వేసవిలోనూ విరివిగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, మల్లెల ఉత్పాదనలో ఈజిప్ట్, భారత్‌ పోటాపోటీగా ఉంటున్నాయి. మల్లెలను ఎరిగిన ప్రతి దేశంలోనూ ప్రజలు మల్లెలను ఇష్టపడతారు. అయితే, మిగిలిన జనాలతో పోల్చుకుంటే, మల్లెలంటే మన తెలుగువాళ్లకు మరికొంచెం మక్కువ ఎక్కువ. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ శంకరంబాడి సుందరాచారి తెలుగుతల్లిని తన మాటల మల్లెపూలదండతో అలంకరించడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం.

మన సాహిత్యంలోని ఆధునికుల్లో మల్లెలను అమితంగా ఆరాధించినవాడు చలం. ఆయనకు మల్లెలను అలంకరించుకునే అలవాటు కూడా ఉండేది. మల్లెపూల గురించి ఆయన అద్భుతమైన కవిత రాశారు. ‘మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!...’ అంటూ సాగే ఆ కవితలో ‘ఒక్క స్వర్గంలో తప్ప/ ఇలాంటి వెలుగు తెలుపు/ లేదేమో– అనిపించే మల్లెపూలు/ అలసి నిద్రించే రసికత్వానికి/ జీవన మిచ్చే ఉదయపు పూలు/ రాత్రి సుందరస్వప్నానికి సాక్షులుగా/ అవి మాత్రమే మిగిలిన/ నా ఆప్తులు!’ అంటాడాయన. మల్లెలంటే అంతటి వల్లమాలిన ఇష్టం ఉండటం వల్లనే కాబోలు చలం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అంతగా పరిమళభరితం చేశాడు.

 
మల్లెల్లో రకాలుంటాయి... బొండుమల్లెలు, కాడమల్లెలు, రేకమల్లెలు, సెంటుమల్లెలు. మన కవిత్వంలో సిరిమల్లెలు, మరుమల్లెలు కనిపిస్తాయి. మల్లెలసాగు సిరులు కురిపిస్తుంది. ఇక మల్లెలకు మరులు కురిపించే లక్షణమూ ఉంది. ‘అరవింద మశోకం చ చూతం చ నవమల్లికా!/ నీలోత్పలం చ పంచై తే, పంచబాణస్య సాయకాః!’ అనే శ్లోకాన్ని గమనిస్తే ఈ సంగతి స్పష్టంగానే అర్థమవుతుంది. మన్మథుడు సంధించే ఐదురకాల పూలబాణాలలో మల్లెల బాణాలు కూడా ఉన్నందునే కాబోలు మన కవులు వాటిని ‘మరుమల్లెలు’ అంటూ మురిసిపోయారు. మల్లెలకు శృంగారాలంకరణల్లో మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక ఆరాధనల్లోనూ ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకు మల్లెలు ప్రీతిపాత్రమైనవి. ‘మల్లికా కుసుమైరేవం వసంతే గరుడధ్వజమ్‌/ యోర్చయేపరయా భక్త్యా దహేత్‌ పాపం త్రిధార్జితమ్‌’ అని ‘పుష్పచింతామణి’ చెబుతోంది. అంటే వసంత రుతువులో శ్రీమహా విష్ణువును మల్లెలతో అర్చిస్తే, మనోవాక్కాయ కర్మల ద్వారా చేసిన పాపాలన్నీ నశిస్తాయట! 

పాశ్చాత్యదేశాల వారికి మల్లెలంటే వెంటనే స్ఫురించేది మన భారతదేశమే! భారతదేశాన్ని మల్లెలకు చిరునామాగా భావిస్తారు వాళ్లు. ‘మల్లెలు– అవి భారత్‌లో నా తల్లితండ్రులతో గడిపిన జ్ఞాపకాలను మోసుకొస్తాయి’ అంటుంది బ్రిటిష్‌ నటి యాన్‌ రీడ్‌. ఆమె తండ్రి ఒక బ్రిటిష్‌ దినపత్రిక కోసం భారత్‌లో ఉంటూ పనిచేసేవాడు. అందుకే ఆమె జ్ఞాపకాల్లో ఆ మల్లెల పరిమళం! జ్ఞాపకాల్లోనే కాదు, పరిసరాల్లోనూ మల్లెల పరిమళం అవసరం. ముఖ్యంగా దేశంలో రాజకీయ దుర్గంధం మితిమీరుతున్న సమాజానికి మల్లెల పరిమళమే కాస్తంత ఉపశమనం. మల్లెలు పూసి, పరిమళించాలంటే ఏటేటా వేసవులు రావాల్సిందే! రాజకీయాల వేడినే భరిస్తున్న వాళ్లం వేసవులను భరించలేమా? కనీసం మల్లెల కోసమైనా! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top