వలస జీవులపై వికృత క్రీడ

Sakshi Editorial On Migrant Workers Tamil Nadu

అసత్యాల కన్నా అర్ధసత్యాలు ఎక్కువ ప్రమాదం. ఎక్కడో జరిగినదాన్ని మరెక్కడో జరిగినట్టు చూపెట్టి, బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టే ఫేక్‌ వీడియోల హవా పెరిగాక ఈ ప్రమాదం ఇంకెంతో పెరిగింది. ఉత్తరాది వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సోషల్‌ మీడియాలో తెగ తిరిగిన ఘటన, దానిపై బిహార్‌ సహా దేశవ్యాప్తంగా రేగిన రచ్చ అందుకు తాజా నిదర్శనం.

తమిళనాడు ప్రభుత్వం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, వేరెక్కడో జరిగిన ఘటనల దృశ్యాల్ని ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు వీడియోల్లో చూపారని నిర్ధారించాల్సి వచ్చింది. బిహార్‌ సీఎం తొందరపాటుతో హడావిడిగా తమిళనాడుకొచ్చిన బిహార్‌ ప్రభుత్వాధికారులూ నిజం తెలుసుకొని, సంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది.

గతంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ఫేక్‌ న్యూస్‌ల ముప్పుతో పాటు వలసదారులనే గుర్తింపు తీరని కళంకంగా మారి, హింసా ద్వేషాలను ప్రేరేపిస్తున్న వికృత ధోరణిని చర్చకు పెట్టింది.  

స్వరాష్ట్రం, వలసపోయిన రాష్ట్రం – రెండింటి ఆర్థికాభివృద్ధిలో అంతర్‌ రాష్ట్ర వలసలది కీలక పాత్ర. అయితే, దేశంలో వలసలపై ప్రభుత్వ గణాంకాలు సమగ్రంగా లేవు. పాత లెక్కలే ఇప్పటికీ ఆధారం. 2011 జనగణన ప్రకారం మన దేశంలోనే అంతర్గత వలసదార్ల సంఖ్య 45.36 కోట్లు. 

అంటే దేశ జనాభాలో 37 శాతం మంది. ఇక, 2016 – 17 నాటి ఆర్థిక సర్వే ప్రకారం స్వస్థలం వదిలిపోతున్న మొత్తం వలస శ్రామికుల్లో దాదాపు సగం మంది సాపేక్షంగా తక్కువ అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల జనాభాయే. ఈ అభాగ్య సోదరులను గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలు అధికంగా ఆదరిస్తున్నాయి. వెరసి, జీవనోపాధికై వస్తున్న ఉత్తరాది వారిని ఢిల్లీ తర్వాత ఎక్కువగా అక్కున చేర్చుకుంటున్నది దక్షిణ భారతావనే అనుకోవచ్చు.

పారిశ్రామిక కేంద్రంగా పేరున్న తమిళనాట 10 లక్షల మందికి పైగా వలస కార్మికులున్నారు. ఇది ఆ రాష్ట్ర కార్మిక విభాగం పక్షాన జరిపిన 2016 సర్వే లెక్క. అధికశాతం మంది బడుగు వేతన జీవులైన నైపుణ్యం లేని శ్రామికులు. ఎక్కువగా బెంగాల్, అస్సామ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్‌ల నుంచి వచ్చినవారే. తిరుప్పూర్, ఈరోడ్‌ లాంటి వస్త్ర కేంద్రాల వృద్ధికి, రాష్ట్ర పురోగతికి వీరు వెన్నెముక.

ఈ పరిస్థితుల్లో వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సంబంధం లేని పాత వీడియోలు సోషల్‌ మీడియాలో తిరగడం తాజా సమస్యకు కారణం. హిందీవారికి వ్యతిరేకంగా తమిళనాట ఏదో జరిగిపోతోందని నమ్మించడానికి ఒక వర్గం వీడియోలను ఆన్‌లైన్‌లో తెగతిప్పింది. దాంతో తమిళనాడు ఆ ఘటనలు వేరెక్కడివో, ఎవరెవరి మధ్య జరిగిన ఘటనల తాలూకువో వివరించాల్సి వచ్చింది. నిజం వెల్లడయ్యేలోగా కథ బిహార్‌ అసెంబ్లీకి ఎక్కింది.  

నిజం కాళ్ళకు చెప్పులు తొడిగే లోపల అబద్ధం ఊరంతా చుట్టివస్తుందన్నట్టుగా అసత్యప్రచారం దేశం చుట్టింది. అయితే, బీజేపీయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఈ తరహా వైరల్‌ ఫేక్‌ న్యూస్‌ వల్ల ఎవరికి, ఏ ప్రయోజనం ఉందనే అనుమానాలూ పైకి వచ్చాయి. సాక్షాత్తూ తమిళనాడు సీఎం సైతం ఘర్షణలు రేపి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రకోణం గురించి ప్రస్తావించడం గమనార్హం.

వాస్తవానికి ఏ రాష్ట్రం, ఏ భాషకు చెందినవారినైనా స్థానికులుగా కలుపుకొనే ఆత్మీయ, ఆతిథేయ సంస్కృతి దక్షిణాదిన, అందులోనూ తమిళనాట తరతరాలుగా ఉన్నదే. శాంతిభద్రతల పరిరక్షణలో అక్కడి పోలీసు యంత్రాంగం పేరున్నదే. అక్కడే ఇలా జరిగిందంటే – ఇతర రాష్ట్రాలకిది మేలు కొలుపు. కొందరి తుంటరితనం, స్వార్థ రాజకీయాలు సోదర భారతీయుల మధ్య విభజన గీతలు గీస్తే అది పెను ప్రమాదం. ఐకమత్యం, సౌభ్రాతృత్వాలకు గొడ్డలిపెట్టయ్యే ఏ వికృత ధోరణినీ ఎవరూ సహించకూడదు. సహకరించకూడదు. 

హోలీకని రద్దీ రైళ్ళలో స్వరాష్ట్రాలకు తరలివెళ్ళిన వలస కార్మికుల్లో ఎందరు తిరిగొస్తారనేది ఇప్పుడు తమిళనాట హోటళ్ళ నుంచి పరిశ్రమల వరకు అన్నిటి ఆందోళన. ఏ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నైనా అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల వాటా అవిస్మరణీయం. వారికి సౌకర్యాలు, సురక్షిత వాతావ రణం కల్పించడం కీలకమంటున్నది అందుకే.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాలకు కానీ పార్లమెంట్‌ ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం–1979’ చేయలేదు. అయినా ఇప్పటికీ వారి పరిస్థితి పూర్తిగా మారలేదు. వారి స్థితిగతులపై విస్తృత సర్వేలు జరపాలి. కేరళ నమూనా సర్వేలు అందుకు ఆదర్శం. సర్వేల సమాచారంతో సొంత, వలస రాష్ట్రాల్లో మెరుగైన విధానాలు చేపట్టవచ్చు. 

వలసదార్ల వల్ల స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయనీ, మురికివాడలు, నేరాలు పెరుగుతున్నాయనీ రాజకీయ స్వార్థంతో పేలడం తేలిక. ఇలా ‘బయటివార’నే ముద్ర వేసి స్థానికుల్ని రెచ్చగొడితే, తాత్కాలిక లబ్ధి ఉంటుందేమో కానీ, శాశ్వత నష్టం తథ్యం. భారత పౌరులెవరైనా దేశ భూభాగంలో ఎక్కడికైనా ఉపాధికై స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, స్థిరపడవచ్చనేది మన రాజ్యాంగం (ఆర్టికల్‌ 19) కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ, కరోనా వేళ ‘ఇన్‌ఫెక్షన్‌ వాహకులు’ అంటూ కన్న ప్రాంతం, ఉన్న ఊరు వలస కార్మికుల్ని ‘అవాంఛనీయులు’గా చూశారు.

వారిపై దాడులూ అనేకసార్లు రికార్డులకెక్కవు. ఈ పరిస్థితుల్లో వలసదార్లు సైతం స్థానికులతో ఏకమయ్యేలా తగిన చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధి. అలాగే, సామాజిక న్యాయం, మానవ హక్కులను పరిగణనలోకి తీసుకొని కీలకమైన ఈ శ్రామిక పెట్టుబడిని కాపాడుకొనేలా సమగ్ర, వ్యవస్థీకృత విధానం అవసరం. అప్పుడే తమిళనాట తలెత్తిన తాజా ఫేక్‌ న్యూస్‌ రచ్చ లాంటివి నిర్వీర్యమవుతాయి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top