మరో ఆర్నెల్లలో ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆ దేశం హైస్కూల్ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. రాజధాని పారిస్లో గత నెల 18న రాజుకున్న ఆందోళన విస్తరించటానికి ఎంతోకాలం పట్టలేదు. వేలాదిమంది విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ అరెస్టు చేయగా... బాష్పవాయు గోళాలు, స్టన్ గ్రెనేడ్లు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించటంతో వందలాదిమంది పిల్లలు, ఉపాధ్యాయులు గాయపడ్డారు.
ఉద్యమం వల్ల వేలాది పాఠశాలలు మూతబడ్డాయి. కొన్నిచోట్ల పాఠశాల భవనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పెట్టగా, తమపై సాగిస్తున్న హింసను సమర్థించుకోవటానికి పోలీసులే ఆ పని చేస్తున్నారని ఉద్యమకారుల ఆరోపణ. ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఏ ప్రభుత్వమూ జనంతో తగాదా పడదు. కానీ అధ్యక్షుడు ఇమానియేల్ మాక్రాన్ ఇందుకు విరుద్ధం. వరసగా 2017, 2022 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఎటూ రాజ్యాంగ ప్రకారం మూడో దఫా పోటీ చేయడానికి లేదు. కనుకనే నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది.
మన దేశంలో ఆమధ్య కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు యూపీ, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర తదితరచోట్ల బడుల్ని సందర్శించి పశువుల పాకల్లో తరగతులు నడవడం, టీచర్లు లేకపోవటం, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో పిల్లలు బిక్కుబిక్కుమంటూ చదువుకోవడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆ తర్వాత సీజేపీ నేతలపై దాడులు, అరెస్టులు మొదలయ్యాయి. ఎంతో అభివృద్ధి సాధించిందని అందరూ అనుకునే ఫ్రాన్స్లో సైతం బడులు ఇలాగే అఘోరించాయని వస్తున్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
చాలా పాఠశాలలకు టీచర్ల కొరత. దీనికితోడు కూలిన గోడలు, విరిగిన కిటికీలు, లీకవుతున్న పైకప్పులు, సరిగా పనిచేయని హీటింగ్ వ్యవస్థలు వెక్కిరిస్తున్నాయి. తరగతి గదులు కిక్కిరిసిపోతున్నాయని, అందువల్ల టీచర్లు శ్రద్ధ పెట్టలేకపోతున్నారని పిల్లల ఆరోపణ. ఫ్రాన్స్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి 12నుంచి 24మంది లోపు పిల్లలుండాలని, సాధారణ పాఠశాలల్లో ఈ సంఖ్య 22–26 మధ్య ఉండొచ్చని నిర్దేశించారు. చిత్రమేమంటే ఈసారి అధికారంలోకి రావాలని ఆరాటపడే లీపెన్ నేతృత్వంలోని అతి మితవాద పక్షం విద్యార్థుల్ని తప్పుబడుతోంది.
పాలకులు నియంతలైనప్పుడు తిరగబడాలని ప్రపంచానికి బోధించింది ఫ్రాన్సే. రాజరికాన్నీ, భూస్వామ్య వ్యవస్థనూ సమాధి చేసిన బాస్టిల్ కోట ముట్టడి 1789 జూలై 14న పారిస్లో జరిగిన భారీ ర్యాలీ పర్యవసానమే. అంతవరకూ ప్రపంచ చరిత్రలో జనం ఇలా సామూహిక ప్రదర్శన నిర్వహించిన దాఖలా లేదు. 1968లో పతనమవుతున్న విద్యాప్రమాణాలనూ, ఉన్నత విద్యాసంస్థల్లో సదుపాయాల లేమినీ ప్రశ్నిస్తూ విద్యార్థులు భారీ ఉద్యమాన్ని నిర్వహించారు. డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదనను నిరసిస్తూ 2018–2020 మధ్య జరిగిన ‘యెల్లో వెస్ట్’ ఉద్యమం సాగింది. ఈ ఉద్యమాల నుంచి ప్రస్తుత పాలకులు నేర్చుకున్నదేమీ లేదు.
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాక ఫ్రాన్స్ రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. అయినా విద్యారంగం గుడ్లు తేలేస్తున్నది. అంతేకాదు... వైద్యం, పెన్షన్లు, ఇతర సామాజిక సేవా రంగాలూ నానాటికీ క్షీణిస్తున్నాయి. మరోపక్క రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. మాక్రాన్ తొలి ఏలుబడి నాటికి 3,500 కోట్ల డాలర్లుండే రక్షణ బడ్జెట్ ఇప్పుడు 7,100 కోట్ల డాలర్లు! రష్యాను ‘ఎప్పటికైనా’ జయించాలన్న తాపత్రయంతో నాటో భాగస్వామ్య దేశాలన్నిటికీ ఈ ఉన్మాదం పట్టుకుంది. ఫ్రాన్స్ అప్పు 3 లక్షల 60 వేల కోట్ల డాలర్ల పైమాటే. దాని జీడీపీలో ఇది 119 శాతం. బడ్జెట్ లోటు జీడీపీలో 5.4 శాతం. ఈయూ విధించిన పరిమితి కేవలం 3 శాతం.
ప్రభుత్వం ఖర్చుల కోసం బాండ్లు వేలం వేస్తే కొనే నాథుడే లేడంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తుంది. ఫ్రాన్స్ వాలకంతో ఈయూ సభ్య దేశాలు లబోదిబోమంటున్నాయి. ఆ సంక్షోభం వల్ల యూరో విలువ పడిపోయి, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని మొత్తుకుంటున్నాయి. అందుకే ఈ పార్లమెంటు సమావేశాల్లో ‘కఠినమైన బడ్జెట్ కోతలు’ విధించటానికి ప్రభుత్వం సిద్ధపడుతుండగా, ఈలోగా విద్యార్థి ఉద్యమం వచ్చిపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే ఈ సంక్షోభం మరింత విస్తరిస్తుంది.


