
తలుపులమ్మకు చీర, సారె
వైభవంగా సామూహిక కుంకుమ పూజ, హోమం
తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలను పురష్కరించుకుని తలుపులమ్మ అమ్మవారికి తుని వాసవీ కన్యకా పరమేశ్వరి మహిళా భక్త సమాజం, వివిధ గ్రామాల మహిళలు చీరసారెలను సమర్పించారు. శుక్రవారం చీరసారెలతో వచ్చిన మహిళలకు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి చీరసారె సమర్పించిన తర్వాత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవస్థానం తరఫున భక్తులందరికీ పసుపు, కుంకుమ, రవిక, గాజులు, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ నెల 24న సప్తనదీ జలాలతో అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఈఓ తెలిపారు.