
వెజిట్రబుల్స్
ఆలమూరు: ఏం కొంటాం.. ఏం తింటాం.. అనేట్టుంది కూరగాయల పరిస్థితి. వీటి ధర అంతకంతకూ పెరుగుతోంది. ఉల్లిని కొంటేనే కన్నీరు వస్తోంది. పచ్చిమిర్చికి ఘాటు ఎక్కువైంది. వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడంతో కూరగాయల ధర రోజురోజుకూ పెరిగిపోతుంది.ఽ బహిరంగ మార్కెట్‌లో ఇప్పటి వరకూ సరైన ధర లేక ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నా దిగుబడి లేక దిగాలు చెందుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో గత నెలతో పోలిస్తే ఈ వారంలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. గోదావరిలో వరద ఉధృతి పెరిగినా, వర్షాలు కురిసినా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిలకడగా ఉన్న నాణ్యమైన ఉల్లి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.40కు చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల దిగుబడి క్రమేపీ తగ్గిపోయినందువల్లే ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పంట తుది దశకు చేరుకోవడంతో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని చాగల్నాడు, మెట్ట, లంక పరివాహక ప్రాంతాల్లో సుమారు 38 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల నుంచి కూరగాయల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఉద్యాన రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో టమోటా, కొత్తిమీర, వంకాయ, దొండకాయ ధరలు కిలో రూ.పదికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే కూరగాయల సాగు ప్రస్తుతం తుది దశకు చేరుకోవడంతో దిగుబడులు తగ్గిపోతుండటంతో డిమాండ్ పెరిగి, ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని మడికి, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర హోల్‌సేల్ మార్కెట్‌లకు గత వారం రోజుల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
వరద పెరిగినా.. వర్షం పడినా..
గోదావరికి ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో వరదల వచ్చే అవకాశం ఉంది. దీంతో లంకల్లో సాగు చేసే పంట పూర్తిగా తగ్గిపోతుంది. అదే క్రమంలో వర్షాలతో మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లోని పంట దిగుబడి అరకొరగా ఉండే అవకాశం ఉంది. దీంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమైతే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. లంక పరివాహక ప్రాంత రైతులు మళ్లీ వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్ నెల తరువాత గాని కూరగాయల సాగు చేపట్టే అవకాశం లేదు. దిగుబడి కోసం మరో మూడు నెలల వేచి ఉండాలి. దీంతో పెరుగుతున్న కూరగాయల ధరలు రాబోయే సంక్రాంతి వరకూ ఆకాశానికి ఎగబాకి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకూ కిలో రూ.10 నుంచి రూ.20 వరకూ పలికిన పలు కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.50కి దాటాయి. అలాగే చిక్కుళ్లు, ఆకాకర, అల్లం ధరలు కిలో రూ.100కు పైగా వరకూ విక్రయిస్తున్నారు. కొత్తిమీర సాగు పూర్తి కావడంతో బెంగళూరు నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కిలో రూ.150 పలుకుతుంది. దీంతో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర ఆకుకూరలకు డిమాండ్ పెరగడంతో, వాటి ధరలు పెరుగుతున్నాయి.
కూరగాయలు గతం ప్రస్తుతం
కిలో రూ. ధర
ఉల్లి 25 50
పచ్చిమిర్చి 20 70
అల్లం 70 120
బంగాళదుంప 20 35
వంకాయలు 20 60
బెండకాయలు 20 50
బీట్‌రూట్ 30 50
క్యాబేజీ 20 50
చిక్కుడు 80 120
అరటికాయ 05 10
కాలీఫ్లవర్ 25 50
దొండకాయలు 25 40
టమోటా 25 60
బీరకాయ 30 60
గోరుచిక్కుళ్లు 25 40
ఆనబకాయ 10 20
కాకరకాయ 25 60
కంద దుంప 40 60
పెండలం దుంప 35 50
బీన్స్ 60 80
కొత్తిమీర 70 150
క్యాప్సికం 40 60
ఆకాకర 70 120
ఒక్కసారిగా పెరగడంతో...
కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. ఇప్పటి వరకూ బహిరంగ మార్కెట్‌లో స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరుగుపోతుండడంతో ఆ ప్రభావం రిటైల్ వ్యాపారంపై పడింది. పెరుగుతున్న ధరలతో కూరగాయల వ్యాపారం లాభసాటిగా ఉండటం లేదు.
– చిన్నం రాజు, రిటైల్ కూరగాయల వ్యాపారి, ఆలమూరు
సరకు కొరత ఏర్పడింది
లంక, మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఒకేసారి తగ్గిపోవడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా సరకు కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్‌కు సరఫరాలో భారీ వ్యత్యాసం ఉండడంతో కూరగాయల ధరల పెరుగుదలకు కారణమైంది.
– చెల్లుబోయిన సింహాచలం,
హోల్‌సేల్ కూరగాయల వ్యాపారి, మడికి
కొనుగోలు చేయలేకపోతున్నాం..
పెరిగిన ధరలతో కూరగాయలను కొనుగోలు చేయలేకపోతున్నాం. వర్షాలతో కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అలాగే రైతు బజార్లలో కూడా అన్ని కూరగాయలు అందుబాటులో ఉండటం లేదు.
– కె.నాగమణి, గృహిణి, పెదపళ్ల
వంటింట్లో ధరల మంట
పంట దిగుబడి తగ్గడమే కారణం
వినియోగదారులపై పెను భారం

వెజిట్రబుల్స్

వెజిట్రబుల్స్

వెజిట్రబుల్స్

వెజిట్రబుల్స్