
ధాన్యం బకాయిలపై జవాబు చెప్పండి బాబూ!
● రైతులకు రూ.250 కోట్లు
వెంటనే చెల్లించాలి
● వైఎస్సార్ సీపీ నేత చెల్లుబోయిన
వేణు డిమాండ్
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా ధాన్యం అమ్మిన రైతులకు 55 రోజులుగా డబ్బులు చెల్లించడం లేదని, జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.250 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని పార్టీ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వరి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. అలాగే, పొగాకు రైతులు సైతం గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఆక్వా, కోకో, వరి, పొగాకు, మిర్చి, మామిడి ఇలా ఏ రైతూ సంతోషంగా లేరని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
విచ్చలవిడిగా ఇసుక దోపిడీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక అంటూ ఆర్భాటంగా ప్రచారం చేశారని వేణు అన్నారు. కానీ, కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు నిబంధనలకు విరుద్ధంగా నదీగర్భంలో ఇసుక డ్రెడ్జింగ్ చేసి, కొండల్లా నిల్వలు చేశారని చెప్పారు. ఒక్కో ఇసుక లారీ వద్ద రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ అడ్డంగా దోచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ డ్రెడ్జింగ్‌లో పట్టుకున్న ఇసుకను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల్ని మత్తులో ముంచుతున్నారు
డ్రగ్స్ రహిత రాష్ట్రమంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పిందని, కానీ, ప్రజల్ని మత్తులో ముంచుతున్నారని వేణు ఆరోపించారు. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం పాలసీ పుణ్యమా అని 24 గంటలూ లభిస్తున్న మద్యం మద్యం మత్తులో కొంతమంది చేస్తున్న ఆగడాలకు రాష్ట్రంలో ఆడపిల్లలు అఘాయిత్యాలు, హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఒక ఉద్యోగమని చెప్పి, ఇప్పుడు ఇంటికో తాగుబోతును తయారు చేస్తున్నట్టుగా పరిస్థితిని దిగజార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా.. పోలీసు వ్యవస్థ సక్రమంగా పని చేస్తోందా.. కేవలం ప్రతిపక్షాలను నియంత్రించడానికే ఉందా.. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి ఉందా అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి అన్నారు.
అబద్ధాలతో పాలన
శాసన సభ్యులు మారాలని సీఎం చంద్రబాబు అంటున్నారని, కానీ మారాల్సింది ఆయనేనని వేణు అన్నారు. రోజూ అబద్ధాలతో పాలన సాగించడమేమిటని, ప్రజల అవసరాలు తీర్చలేరా అని ప్రశ్నించారు. ‘ప్రతి నెలా పింఛన్లు పంచడమే ముఖ్యమంత్రి కార్యక్రమమా? దీనివల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది’ అని వేణు విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.