
ఎరువుల కొరత లేదు
జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి ఎరువుల కొరతా లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ అన్ని రకాలూ కలిపి జిల్లా వ్యాప్తంగా 35,869 టన్నుల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615, పొటాష్ 2,918, సూపర్ 6,324, కాంప్లెక్స్ ఎరువులు 8,716 టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 83 వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ 27,950 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారని తెలిపారు. రైతులు అవసరం మేరకే ఎరువులు కొనుగోలు చేయాలని మాధవరావు సూచించారు.
నేడు ‘దిశ’ సమావేశం
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి కమిషనర్ పి.ప్రశాంతి సోమవారం ఈ విషయం తెలిపారు. శాఖల వారీగా అమలు చేస్తున్న పథకాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 35 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టం(పీజీఆర్‌ఎస్)కు 35 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఏఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 216 అర్జీలు
రాజమహేంద్రవరం సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 216 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్జీల పరిష్కారంలో లోపాలకు తావు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా అర్జీదారుల స్పందన నిరంతరం తీసుకుంటున్నారన్నారు. అధికారులు సరిగ్గా మాట్లాడుతున్నారా, బెదిరించారా, లంచాలు అడుగుతున్నారా, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారా అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్‌ఓ సీతారామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
లండన్ సీఎంఏ
సమావేశానికి ఆహ్వానం
అమలాపురం టౌన్: ప్రపంచంలో 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 18న లండన్‌లో జరగనున్న సర్వసభ్య సమావేశానికి భారతదేశం నుంచి అమలాపురానికి చెందిన సీఎంఏ సభ్యుడు డాక్టర్ పీఎస్ శర్మ హాజరవుతున్నారు. ఈ మేరకు సీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో డాక్టర్ శర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ విషయం వివరించారు. సీఎంఏ అనుబంధ స్టాప్ టీబీ ఇనిషియేటివ్ సబ్ కమిటీ సభ్యుడిగా తాను నియమితులైన సంగతిని కూడా డాక్టర్ శర్మ తెలిపారు.

ఎరువుల కొరత లేదు