
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
అంబాజీపేట: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబాజీపేట మండలం ముక్కామల, వక్కలంక వంతెనకు మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికులు, సమీప బంధువుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నిజామ్‌పేటకు చెందిన దొమ్మేటి శ్రావణ్‌కుమార్, అతని భార్య రేఖాలక్ష్మి (38), వీరి కుమార్తెలు లాస్య, మోహనగన ప్రియతో పాటు రేఖాలక్ష్మి అమ్మమ్మ కె.ధనలక్ష్మితో కలసి కారులో శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అనంతరం అమలాపురం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కామల వచ్చేసరికి అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్‌ను వీరి కారు బలంగా ఢీకొంది. దాంతో కారులో ఉన్న రేఖాలక్ష్మికి తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. శ్రావణ్‌కుమార్, లాస్య, మోహనగన ప్రియ, ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అమలాపురంలో ఓ ఆస్పత్రికి తరలించారు. రేఖాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణ్‌కుమార్ నిజామ్‌పేటలో స్థిరపడి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనిది యానం కాగా, మృతురాలి తల్లిదండ్రులది అమలాపురం.
పళ్లాలమ్మ జాతరకు వచ్చి...
వారం రోజుల కిందట నిజామ్‌పేట నుంచి వానపల్లి పళ్లాలమ్మ అమ్మవారి జాతర చూసేందుకు వచ్చి అమలాపురంలో మృతురాలి తల్లి ఇంటి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులంతా కలసి వెళ్లారు. అనంతరం యానం వెళ్దామనుకుని అమలాపురం వస్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు చెప్పారు. వారం రోజుల పాటు బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి ఇంతలో ప్రమాదం జరగడంతో అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేసవి సెలవులకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుందని అనుకోలేదని బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
వివాహిత మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం