
నిండా ముంచేలా..
సాక్షి, అమలాపురం: కష్టాలు కొన‘సాగుతున్నాయి’.. పుడమిపుత్రులను నిండా ముంచుతున్నాయి.. తొలకరి సాగును పూర్తిగా దూరం చేశాయి.. గతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు, భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి చేలు నీట మునగడం పరిపాటి. కానీ ఇప్పుడు జూలైలో కురుస్తున్న కొద్దిపాటి వర్షానికే ఆకుమడులు నీట మునగడం చూసి రైతులు నిర్ఘాంత పోతున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మలికిపురం వంటి శివారుల్లో చేలు ముంపుబారిన పడడం అనేది గతం... ఇప్పుడు ఆత్రేయపురం వంటి మెరక ప్రాంతాల్లో కూడా చేలు ముంపునీట ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు సాగు భరోసా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవ సొమ్ము తొలి ఏడాది లేదు.. రెండో ఏడాది ఆ ఊసేలేదు.. నెలలు గడుస్తున్నా ధాన్యం సొమ్ములు లేవు.. ఉచిత బీమాను ఎత్తేశారు. అసలు బీమా పరిహారం ఇస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. ఇలా జిల్లాలోని ఆయకట్టు రైతుకు సాగు చేసే ధైర్యం లేక తొలకరి పంటను వదిలేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు ఇది.
చెరువులు కాదు... చేలు
తామరాకులు, కలువ పువ్వులతో అందంగా కనిపిస్తున్నది చెరువు అనుకున్నారో.. తప్పులో కాలేసినట్టే. ఇది వరి చేను. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో తొలకరి సాగు చేయాల్సిన చేలల్లో ముంపునీరు వీడక ఇలా చెరువుల్లా మారిపోయాయి. నైరుతి వచ్చిన తరువాత సరైన వర్షం లేకపోయినా చేలల్లో రెండు, మూడు అడుగుల ఎత్తున నీరు చేరింది. ముంపునకు భయపడి ఏటా ఇక్కడ తొలకరి సాగును రైతులు వదిలేస్తున్నారు. ఈ ఏడాది నారుమడులు వేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ గ్రామంలోనే కాదు.. ఈ మండలంలో శివారు గ్రామాలైన వానపల్లిపాలెంతో పాటు ఎన్.కొత్తపల్లి, ఎస్.యానాం, వాసాలతిప్ప, కూనవరం, గోపవరం, చల్లపల్లిలో సుమారు 2 వేల ఎకరాల్లో వరి సాగును వదిలేస్తున్నారు.
ఖరీఫ్‌కు ఆదిలోనే హంసపాదు
కొద్దిపాటి వర్షానికే మునిగిన పొలాలు
రూ.2.30 కోట్లతో సైఫన్
నిర్మించిన చోటే ముంపు
సాగుకు వెనకడుగు వేస్తున్న రైతన్నలు

నిండా ముంచేలా..