
అంతటా ఆధ్యాత్మిక పరవశం
● తొలి ఏకాదశి వేళ ఆలయాలకు
పోటెత్తిన భక్తజనం
● కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం
కొత్తపేట: మది నిండా భక్తితో... వెంకన్న స్వామి నామస్మరణతో భక్తజనం మురిసింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసింది. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు వివిధ హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 4.30 గంటలకు స్వామివారి మూలమంత్ర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. మరోపక్క అష్టోత్తర పూజలు, కల్యాణోత్సవం జరిపారు. స్వామివారికి సాయంత్రం గరుడ వాహన, పల్లకీ సేవలు నిర్వహించారు. భక్తుల ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్‌లైన్ ద్వారా దేవస్థానానికి రూ.14,17,965 ఆదాయం సమకూరిందని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.
అంతర్వేది.. భక్తుల పెన్నిధి
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధికి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. నిత్య అభిషేకం, సుదర్శన హోమ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుమారు 6 వేల మందికి అన్నదాన పథకంలో భోజన వసతిని కల్పించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్కరోజే రూ.4,13,719 ఆదాయం వచ్చిందని ఏసీ తెలిపారు.
అప్పనపల్లిలో..
మామిడికుదురు: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మామిడికుదురు శివాలయం నుంచి అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం వరకూ పాదయాత్ర చేశారు. గోవిందనామ స్మరణ చేస్తూ భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అప్పనపల్లి బాలబాలాజీ స్వామిని దర్శించుకున్నారు. 6,500 మంది స్వామిని దర్శించుకోగా, 4,200 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.4,79,852 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు.

అంతటా ఆధ్యాత్మిక పరవశం