
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం
● 12 నుంచి 20 వరకూ నిర్వహణ
● జిల్లాలో 14,238 మంది విద్యార్థులు
రాయవరం: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్ పరీక్షలను 30 పరీక్షా కేంద్రాల్లో . ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 17 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
14,238 విద్యార్థులు
ఫస్టియర్, సెకండియర్ కలిపి 14,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులు 10,519 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బెటర్‌మెంట్ రాసే వారి సంఖ్య అధికంగా ఉంది. సెకండియర్ పరీక్షలకు 3,719 మంది హాజరు కానున్నారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ విద్యార్థులు 12,008 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,230 మంది పరీక్షలు రాయనున్నారు. 12 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, రెండు రెసిడెన్షియల్, 15 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు తప్పిన, బెటర్ మెంట్ కట్టిన విద్యార్థులకు కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 30 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, కస్టోడియన్లను నియమించారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా, పోలీస్ స్టేషన్లలో భద్రపర్చారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు.
రెండు సెషన్లలో
పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ప్రధాన పరీక్షలు 17వ తేదీ వరకు, 19, 20 తేదీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ వంటి సబ్జెక్టులు నిర్వహిస్తారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.
సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు