
దోమల నియంత్రణతో డెంగీ నిర్మూలన
అమలాపురం టౌన్: ఇంటి పరిసరాల్లో దోమల నియంత్రణ జరిగినప్పుడే డెంగీ జ్వరాల నిర్మూలన పూర్తిగా సాకారమవుతుందని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర స్పష్టం చేశారు. దోమల పుట్టుక నివారణలో ప్రజలు పూర్తిగా భాగస్వామ్యమైనప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో డెంగీ నివారణ, అవగాహన ర్యాలీని డాక్టర్ దుర్గారావు దొర శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. దోమల నివారణ పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో డెంగీ వ్యాధి లక్షణాలను ప్రజలు ముందే గుర్తించాలన్నారు. డెంగీ నివారణ నినాదాలతో ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటరు వరకూ సాగింది. ఆ సెంటరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మలేరియా, ఫైలేరియా సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. డెంగీ జ్వరాలు, దోమల నిర్మూలనపై అవగాహన కల్పించారు. డెంగీ అంతం...మన పంతం అంటూ రాసి ఉన్న ప్ల కార్డులను చేతపట్టి వారు ప్రదర్శన నిర్వహించారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డెంగీ జ్వరమొస్తే ఎలాంటి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వైద్యం పొందాలి వంటి అంశాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు మాట్లాడుతూ డెంగీ జ్వర పీడితులు తక్షణమే స్పందించి వైద్యం చేయించుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, ప్రభుత్వ వైద్యాధికారి ఎంఎం మణిదీప్, మలేరియా సబ్ యూనిట్ అధికారులు ఎన్‌వీ రామారావు, ఎస్.రాజబాబు, హెల్త్ విజటర్ ఎ.లక్ష్మి, జిల్లా మలేరియా కార్యాలయ సిబ్బంది వై.ఆదినారాయణ, ఏఆర్‌ఎల్ నాగరాజు, రవితో పాటు వైద్య, మలేరియా, ఫైలేరియా సిబ్బంది పాల్గొన్నారు.
డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర