
జేఎల్‌ఎంలకు పాత సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి
మలికిపురం: 2019లో నియమితులైన జూనియర్ లైన్‌మన్ గ్రేడ్–2 ఉద్యోగులకు పాత ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ ప్రకారమే ప్రమోషన్‌లు, ఇతర సౌకర్యాలూ కల్పించాలని జిల్లా జేఎల్‌ఎం సంఘ సమావేశం కోరింది. గురువారం మలికిపురంలో జరిగిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక సచివాలయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే ఐదేళ్లు గడుస్తున్నా ఎనర్జీ అసిస్టెంట్ విషయంలో ఇంతవరకు ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. కమిటీలు వేస్తూ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెబుతూ కాలం నెట్టుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో ఎనర్జీ అసిస్టెంట్స్ అందరూ సమ్మెకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
ప్రజల రక్షణకు మాక్ డ్రిల్
అమలాపురం రూరల్: భారత్, పాకిస్తాన్ మధ్య అసాధారణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కొనసీమ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించే ఉద్దేశంతో గురువారం అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌లో మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఫైర్ అధికారి పర్యవేక్షణలో అమలాపురం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ మాక్‌డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. మాక్ డ్రిల్‌లో హాస్పిటల్ సిబ్బంది, రోగులు ప్రజలు భాగస్వామ్యమై భవనం నుంచి సురక్షితంగా బయటపడే పద్ధతులు, అగ్నిప్రమాద సమయంలో అనుసరించవలసిన జాగ్రత్తలు, అత్యవసర మార్గాల వినియోగం వంటి అంశాలపై డెమో ఇచ్చారు. ఇలాంటి డ్రిల్లులు ప్రజల్లో అప్రమత్తతను పెంచడమే కాకుండా, విపత్తు సమయంలో వేగవంతమైన స్పందనకు తోడ్పడతాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఫైర్‌మన్ మట్టపర్తి, బాలరామ్, అమలాపురం, ముమ్మిడివరం అగ్నిమాపక సిబ్బంది, కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.