
డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకం
● సాగు ఖర్చు గణనీయంగా తగ్గుదల
● కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: వ్యవసాయ, ఉద్యాన రంగాలలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించడం వల్ల శ్రమ ఖర్చును దాదాపు 70 శాతం వరకు తగ్గించవచ్చని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. వివిధ పంటల సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకమన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో శనివారం డ్రోన్ల వినియోగంపై రైతుగ్రూపు కన్వీనర్లు, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించారు. డ్రాగో సీఈవో రవికుమార్, వేయింగ్ సీఈవో సుధీర్ కుమార్ మాట్లాడుతూ రైతులకు డ్రోన్ల వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించారు. కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా ఒక ఎకరాకు మందును పిచికారీ చేసేందుకు రూ.400 ఖర్చవుతుందని, మాన్యువల్‌గా రూ.1500 అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రైతు గ్రూపులు డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై మక్కువ చూపుతున్నారన్నారు. ఒక్కొక్క డ్రోన్ ఖరీదు రూ. 9.80 లక్షలు కాగా, రైతుకు 80 శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు. అయితే రైతుగ్రూపులు ముందుగా 50 శాతం అంటే రూ.4.90 లక్షలను బ్యాంకులో గ్రూప్ పేరిట డిపాజిట్ చేయాలన్నారు. బ్యాంకు రుణం సబ్సిడీ మంజూరైన అనంతరం గ్రూపునకు ఆ డిపాజిట్‌లో రూ.2.90 లక్షలు తిరిగి వస్తుందన్నారు. మిగిలిన సొమ్ము రూ 2 లక్షలను మూడేళ్ల పాటు నామమాత్రపు వడ్డీతో త్రైమాసిక వాయిదాలలో చెల్లించాలన్నారు. నాబార్డు జిల్లా మేనేజర్ వైఎస్ స్వామినాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు పాల్గొన్నారు.
రూ.13,508.04 కోట్ల రుణ ప్రణాళిక
2025 – 26 ఆర్థిక సంవత్సరానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్ కుమార్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాలలో బ్యాంకుల ద్వారా రూ.13,508.04 కోట్ల రుణ సదుపాయాల అవకాశాలతో కూడిన ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. నాబార్డు డీడీఎం డాక్టర్ వైఎస్ నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ, పంట రుణాలకు రూ.5748.52 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.5091.28 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మిగతా రుణాలను విద్య, గృహ, సంప్రదాయ శక్తి వనరుల తదితర రంగాలకు కేటాయించామన్నారు.