అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి | - | Sakshi
Sakshi News home page

అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి

Mar 16 2025 12:07 AM | Updated on Mar 16 2025 12:07 AM

అదో శ

అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి

కూటమి ప్రభుత్వంలో నిలువెల్లా నిర్లక్ష్యం

16 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు

ప్రాణాంతక వ్యాధులు దూరం

నేడు జాతీయ టీకాల దినోత్సవం

రాయవరం: ఆడవారికి మాతృత్వం వరం. వివాహమైన ఏడాది నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అంతా ఆరా తీసేది మాతృత్వం గురించే. వివాహం అనంతరం గర్భం దాల్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి, వారి సూచనలపై టీటీ ఇంజక్షన్లు వేయించాలి. ఇది తల్లికి, గర్భంలో ఉన్న శిశువుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రసవించినప్పటి నుంచి క్రమం తప్పకుండా 16 ఏళ్లు వచ్చేంత వరకూ టీకాలు వేయాల్సిందే. లేదంటే శిశువు పెరుగుదల లేకపోవడంతో పాటు వ్యాధులు దాడి చేసే ప్రమాదముంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు గర్భిణులకు మూడు టీటీ ఇంజక్షన్లు, శిశువు పుట్టినప్పటి నుంచి 16 ఏళ్ల వరకూ అవసరమైన టీకాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు చక్కగా వినియోగించుకుంటే కళ్ల ముందే శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారు. జిల్లాలో ప్రతి నెలా సుమారు 7 వేల మంది చిన్నారులకు వివిధ వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. నేడు జాతీయ వ్యాక్సినేషన్‌ డే సందర్భంగా తల్లులకు, శిశువులకు ఇచ్చే టీకాల ప్రాధాన్యంపై ప్రత్యేక కథనం.

బీసీజీ

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఏడాది వయస్సు వరకూ చిన్న పిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి, మెదడు, ఇతర అవయవాలకు వచ్చే క్షయను నివారిస్తుంది. పుట్టిన 24 గంటల్లోపు 0.05 ఎం.ఎల్‌. టీకా ఇస్తారు. నెల దాటితే 0.1 ఎంఎల్‌ మోతాదు ఎడమ భుజంపై ఇస్తారు.

హెపటైటిస్‌–బి

ఈ టీకా పచ్చకామెర్లు రాకుండా నివారిస్తుంది. జన్మించిన 24 గంటల్లోపు 0.5 ఎంఎల్‌ మధ్య తొడ పూర్వ పార్శ్వం వైపు వేస్తారు.

ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ (ఓపీవీ)

చిన్న పిల్లల్లో వచ్చే పోలియో వ్యాధి నుంచి జీవితాంతం రక్షిస్తుంది. పుట్టిన వెంటనే, తిరిగి 6, 10, 14 వా రాలు, తిరిగి ఏడాదిన్నరకు పోలియో చుక్కలు నోట్లో వేస్తారు. ఏటా రెండుసార్లు నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో వేసే రెండు చుక్కలు దీనికి అదనం.

రోటావైరస్‌

చిన్న పిల్లల్లో వచ్చే ప్రాణాంతకమైన నీళ్ల విరేచనాల నుంచి కాపాడటానికి రోటావైరస్‌ వ్యాక్సిన్‌ 6, 10, 14 వారాలకు వేస్తారు. ఐదు చుక్కల చొప్పున నోట్లో వేస్తారు.

పెంటావాలెంట్‌

ఐదు ప్రాణాంతక వ్యాధులైన కంఠసర్పి, కోరింత దగ్గు, శిశు పక్షవాతం, పచ్చకామెర్లు, మెదడు వాపు, చెవిటితనం రాకుండా ఈ వ్యాక్సిన్‌ వేస్తారు. 6, 10, 14 వారాల్లో 0.5 ఎం.ఎల్‌ ఎడమ మధ్య తొడ పూర్వ పార్శ్వం వైపు వేస్తారు.

పోలియో వ్యాక్సిన్‌ ఇంజక్షనన్‌ (ఐపీవీ)

చిన్నారులకు పోలియో రాకుండా రెట్టింపు రక్షణ ఇస్తుంది. 6, 14 వారాల సమయంలో 0.01 ఎంఎల్‌ మందును ఇతర టీకాలతో పాటు కుడి జబ్బపై వేస్తారు.

పీసీవీ వ్యాక్సిన్‌

న్యూమోనియా రాకుండా 6, 14 వారాల్లోను, 15–18 నెలల మధ్య వేస్తారు.

తట్టు

పిల్లలకు తట్టు వ్యాధి రాకుండా ఎంఆర్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. మొదటి మోతాదు 0.5 ఎంఎల్‌ 9 నెలల నుంచి సంవత్సరం లోపు, రెండో మోతాదు 16 నెలల నుంచి 18 నెలల మధ్య కుడి భుజంపై ఇస్తారు.

విటమిన్‌–ఎ ద్రావణం

ఒక ఎంఎల్‌ నోట్లో వేస్తారు. దీనిని ప్రతి ఆరు నెలలకోసారి చొప్పున తొమ్మిది మోతాదులు వేయడం వలన రేచీకటి రాకుండా కాపాడుతుంది. కంటి చూపును వృద్ధి చేస్తుంది.

16 నెలల నుంచి 16 ఏళ్ల వరకూ..

● డీపీటీ మొదటి బూస్టర్‌ను 16–24 నెలల్లో వేయాలి.

● ఓపీవీ బూస్టర్‌ను 16–24 నెలల్లో రెండు చుక్కల వంతున నోట్లో వేస్తారు.

● డీపీటీ రెండో బూస్టర్‌ ఐదు, ఆరు సంవత్సరాల్లో ఎడమ భుజంపై వేస్తారు.

● టీటీ ఇంజక్షన్‌ను 10, 16 సంవత్సరాల్లో భుజంపై ఇస్తారు.

కపిలేశ్వరపురం: శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకూ చిన్నారులకు ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు అందించాల్సి ఉంది. అయితే, దీనిపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు రకాల టీకాల నిల్వలు నిండుకున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు.

● కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లోని సుమారు 21 పీహెచ్‌సీల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దీంతో, అయినవిల్లి, వీరవల్లిపాలెం, ముక్కామల, నగరం, లూటుకుర్రు, తాటిపాక, లక్కవరం, కేశనపల్లి, మోరి, సఖినేటిపల్లి పీహెచ్‌సీల పరిధిలోని చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

● తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో సైతం జనవరి, ఫిబ్రవరి నెలల్లో వ్యాక్సినేషన్‌లో సమస్యలు తలెత్తాయి. నెలలో మొదటి, రెండో బుధవారం, మూడు, నాలుగో శనివారాల్లో సచివాలయాల్లో నిర్వహించాల్సిన టీకాల కార్యక్రమంలో అరకొరగా వ్యాక్సిన్లు వేశారు. న్యుమోనియాను నివారించే న్యుమోకోకల్‌ వ్యాక్సిన్‌ గ్రామీణ పీహెచ్‌సీలతో పాటు అర్బన్‌ పీహెచ్‌సీల్లో సైతం అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా ధవళేశ్వరం, రాజానగరం, దోసకాయలపల్లి, కోరుకొండ, పాలచర్ల సీతానగరం తదితర పీహెచ్‌సీల పరిధిలోని ప్రజలు అవస్థలు పడ్డారు. పోలియో నివారణకు వేసే ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌, గవద బిళ్లలు, కోరింత దగ్గు, మెదడు వాపు, కామెర్లు, ధనుర్వాతం సమస్యలు రాకుండా వేసే వ్యాక్సిన్‌ మూడు వారాల పాటు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారు.

● కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం మినహా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలూ నిర్వహించడం లేదు. ప్రతి నెలా 10న గర్భిణులకు పరీక్షలు చేయించడంతో మాత్రమే సరిపెడుతోంది.

టీకాతో ఆరోగ్యం

టీకాలు 11 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి. గర్భిణులు, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం సూచించిన టీకాలను తల్లిదండ్రులు క్రమం తప్పకుండా వేయించాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. టీకాల వలన శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, బయటి వాతావరణంలోని సూక్ష్మక్రిముల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. ఈ టీకాలు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సామాజిక ఆస్పత్రులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తి ఉచితంగా వేస్తున్నాం. ప్రతి బుధ, శనివారాల్లో నిర్వహించే టీకాల కార్యక్రమానికి తల్లిదండ్రులు తమ చిన్నారులను తప్పనిసరిగా తీసుకురావాలి.

– డాక్టర్‌ బీవీవీ సత్యనారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి, అమలాపురం

జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ టీకాలు వేశారిలా..

లక్ష్యం 25,666

బీసీజీ 25472

ఓపీవీ 25,491

హెపటైటిస్‌ 25,460

వీఐటీకే 25,093

ఓపీవీ–1 25,448

ఐపీవీ–1 25,450

రోటా–1 25,452

ఓపీవీ–2 25,438

పెంటా–2 25,411

రోటా–2 25,408

ఓపీవీ–3 25,425

పెంటా–3 25,387

రోటా–3 25,414

ఐపీవీ–2 25,454

పీసీవీ–2 25,378

ఎంఆర్‌–1 25,232

పీసీబీ–బి 25,052

జిల్లావ్యాప్తంగా మొత్తం 97 శాతం మంది చిన్నారులకు టీకాలు ఇచ్చారు. మిగిలిన మూడు శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి1
1/2

అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి

అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి2
2/2

అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement