
క్లస్టర్ సమావేశాలతో విద్యావ్యవస్థలో మార్పులు
అమలాపురం టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్లస్టర్ సమావేశాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయని రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) జి.నాగమణి అన్నారు. అమలాపురంలోని కొంకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూలులో బుధవారం జరిగిన క్లస్టర్ సమావేశాన్ని నాగమణి సందర్శించి మాట్లాడారు. క్లస్టర్ సమావేశాలకు తోడు ప్రతీ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచే దిశగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు. కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సూచనలను విధిగా పాటిస్తూ క్లస్టర్ కాంప్లెక్స్‌లను విజయవంతంగా నిర్వహించాలన్నారు. హైస్కూలు, క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్‌ఎం కె.ఘన సత్యనారాయణ ఆర్జేడీకి క్లస్టర్ సమావేశాల నిర్వహణను వివరించారు. డీసీఆర్‌బీ సెక్రటరీ బి.హనుమంతరావు, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్‌ఎస్‌వో రమేష్, సీఆర్పీ ఎం.అనూష పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయాలి
అమలాపురం టౌన్: కోనసీమలో చేపట్టిన కోటిపల్లి– నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధులు బృందం విజ్ఞప్తి చేసింది. రాజమహేంద్రవరానికి బుధవారం వచ్చిన రైల్వే జనరల్ మేనేజర్‌ను కేఆర్‌ఎస్‌ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యంతో కూడిన బృందం స్వయంగా కలసి నెమ్మదిగా సాగుతున్న కోనసీమ రైల్వే పనులను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు జనరల్ మేనేజర్‌కు ఓ వినతి ప్రత్రాన్ని అందజేశారు. అమలాపురంలో 2001 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ఏడాదిన్నర క్రితం మూసి వేశారని జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. మూత పడిన ఆ రిజర్వేషన్ కౌంటర్‌ను తిరిగి తెరిపించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కోనసీమకు ప్రస్తుతానికి రైలు మార్గం లేదు కాబట్టి రైల్వే ప్రయాణికులు పూర్తిగా ఈ రిజర్వేషన్ కౌంటర్‌పైనే ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తానని జీఎం చెప్పారని డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటనలో తెలిపారు. కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సప్పా నాగేశ్వరరావు, ఎం.మురళీకృష్ణ, వి. కృష్ణారావు, మరువాడ శ్రీనివాస్ తదితరులు రై ల్వే జనరల్ మేనేజర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
హౌసింగ్ లబ్ధిదారులకు
అదనపు సాయం : కలెక్టర్
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం 10,767 మంది లబ్ధిదారులకు రూ.6.53 కోట్ల అదనపు సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు ఆన్‌లైన్ సర్వే ప్రక్రియపై లబ్ధిదారులకు అవగాహన అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వారికి, వెనుకబడిన తరగతుల వారికి రూ.50 వేలు, గిరిజన తెగల వారికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారన్నారు.
త్వరగా భూ సేకరణ
నరసాపురం బైపాస్ రోడ్డు భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి జాతీయ రహదారుల అభివృద్ధికి టెండర్లు జారీ చేసేందుకు వీలుగా అప్పగించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురం ఆర్డీవో జాతీయ రహదారులు ఇంజినీర్లు, మలికిపురం సఖినేటిపల్లి తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రక్రియ అవార్డులు పాస్ చేయడం, నష్టపరిహారాల చెల్లింపు, భూముల సేకరణ.. అప్పగింత, కోర్టు కేసుల పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ 98శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీవో కె. మాధవి, జాతీయ రహదారుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.నిక్కి క్రెజ్, సఖినేటిపల్లి, మలికిపురం తహసీల్దార్లు వెంకటేశ్వర రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

క్లస్టర్ సమావేశాలతో విద్యావ్యవస్థలో మార్పులు