నష్టాల‘బంతి’
ధరల్లేక పూల రైతు విలవిల
భారీగా తగ్గిన బంతి, చామంతి ధరలు
తుపాను కారణంగా మరింత కుదేలు
పూలను కోయకుండా వదిలేస్తున్నారు
ధర పలకని పూలను రోడ్లపై పారబోస్తున్న అన్నదాతలు
పలమనేరు : జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో పూల సాగు చేసిన రైతులు ఆశించిన ధరలు లేక కుదేలయ్యారు. మొన్నటి దాకా ఓ మోస్తరుగా ఉన్న ధరలు ఈ తుపాను కారణంగా ధర మరింత దిగజారింది. బయటి ప్రాంతాల్లోనూ ధరలు తగ్గుముఖం పట్టడంతో పూలను కొనేందుకు వ్యాపారులు ఆసక్తిని చూపకపోవడంతో ధరలు పతనమయ్యా యి. దీంతో పాటు వర్షం కారణంగా నాణ్యత తగ్గిన పూలను రైతులు తోటల్లోనే కోయకుండా వదిలేస్తున్నారు. మరో రెండు నెలల దాకా శుభ కార్యాలు లేకపోవడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆ మేర బంతి ధర వారం కిందట రూ.50 దాకా ఉండగా ఇప్పుడు కిలో రూ.15 మాత్రమే పలుకుతోంది. చామంతి ధర మొన్నటి దాకా రూ.150 దాకా ఉండగా వర్షంతో వందకు చేరింది.
ఎడతెగని వర్షాలతో ..
పూల సాగుకు తుపాన్ కారణంగా నష్టాలు తప్పటడం లేదు. వర్షానికి తడిచి పూల నాణ్యత తగ్గుతుంది. దీంతో వీటికి మార్కెట్‌లో పెద్దగా ధరలు పలకవు. ఎకరా పూల సాగుకు రూ.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన రైతులు బంతి పూలు రూ.50 దాకా, చామంతి రూ.150 దాకా ఉంటే తప్ప రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా పూలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు. మండీలకు తీసుకెళ్లినా అమ్మకాలు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో పలువురు రైతులు పొలాల్లోనే పూలను కోయకుండా వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి విజయవాడకు ఎక్కువగా బంతి పూలను తీసుకెళుతుంటారు. అయితే అక్కడ కూడా డిమాండ్ లేక కొనేవాళ్లు లేరు. దీంతో మార్కెట్‌కు తీసుకెళ్లిన పూల నాణ్యత లేని కారణంగా రోడ్లపక్కన పడేస్తున్నారు.
హైబ్రిడ్ రకాలతో పెరిగిన ఉత్పత్తులు
పలమనేరు డివిజన్‌లో ఈవిడత సుమారు 200 హెక్టార్లలో ఎల్లో మాక్సిజిమమ్ అనే రకం బంతి, మేరీగ్లోబ్ అనే రకం చామంతి పంటను రైతులు ఎక్కువగా సాగు చేశారు. గతంలో నాటు రకాలను పండిచేవారు. కాబట్టి ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పూల ఉత్పత్తి ఉండేది. ప్రస్తుతం హైబ్రిడ్ రకాల కారణంగా ఎకారానికి 8 నుంచి 10 టన్నులు ఉత్పత్తి అవుతోంది. కుప్పం ప్రాంతంలోని గ్రీన్ హౌస్‌లలో ఎకరానికి మేలి రకం పూలు 15 నుంచి 18 టన్నుల ఉత్పత్తి కావడం గమనార్హం.పంట ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేక ధరలు అమాంతం పతనమవుతున్నాయి. వీకోట, కుప్పం తదితర పూల మార్కెట్‌కు భారీగా సరుకు వస్తున్నా గిరాకీ లేదు.


