మోకాళ్లపై నిలబడి దళితనేత విన్నపం
పుంగనూరు : మండలంలోని దళితులకు శ్మశాన వాటికల కోసం సరైన స్థలాలను కేటాయించాలని దళిత నేత రాజు ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో నేరుగా తహసీల్దార్ రాముకు మోకాళ్లపై నిలబడి మొరపెట్టుకున్నాడు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల నక్కబండలో ఒకరు మరణించగా , దహనం చేయడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అనేక గ్రామాల్లో వంకలు, చెరువుల సమీపంలోని స్మశానాలను కేటాయించడం వలన దళితులు ప్రతి రోజు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితుల గౌరవం దెబ్బతింటోందని, ప్రతి గ్రామంలో సురక్షితమైన, అందుబాటులో ఉండే స్థలాల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస సౌకర్యాలు కల్పించి, వారికి తగిన ఇంటి స్థలాలను కేటాయించి, కావాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వ అధికారులు స్పందించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ సుప్రియ, ఎస్‌ఐ కెవి.రమణ, మున్సిపల్ , రెవెన్యూ సభ్యుల ఎన్‌ఆర్.అశోక్, చిన్నరాయులు, నరసింహులు, రామయ్య, రమణ, ఎం.శంకరప్ప, రామకృష్ణ, కృష్ణప్ప, శ్రీనివాసులు, చిన్నబ్బ, శ్రీదేవి పాల్గొన్నారు.


