కొత్త రూల్స్‌, వీళ్లు తప్పని సరిగా ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాల్సిందే!

New Income Tax Rules - Sakshi

ఐటీఆర్‌..అంటే ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌..ఈ ఫారం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరానికి గాను మీకు వచ్చిన ఆదాయాన్ని డిక్లేర్‌ చేయాలి. ఆదాయాలను అయిదు రకాలుగా వర్గీకరించారు. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం, మూలధన ఆదాయం మరియు ఇతర ఆదాయం. స్థూల ఆదాయం లెక్కించి, అందులో నుంచి మినహాయింపులు, తగ్గింపులు తీసివేసిన తర్వాత వచ్చే నికర ఆదాయం బేసిక్‌ లిమిట్‌ దాటితే మీరు రిటర్న్‌ వేయాలి. 

60 సం.లు దాటని వారికి బేసిక్‌ లిమిట్‌ రూ. 2,50,000 

60–80 సం.ల మధ్య వారికి రూ. 3,00,000 

80 ఏళ్లు పైబడిన వారికి రూ. 5,00,000 

ఇది కాకుండా, ఆదాయం లేకపోయినా టీడీఎస్‌ ద్వారా రిఫండ్‌ క్లెయిం చేయదల్చుకున్న వారు, అలాగే విదేశాల్లో ఆస్తులు ఉన్న వారు, ఆదాయంతో నిమిత్తం లేకుండా రిటర్ను వేయాలి. 

మీరో వ్యాపారస్తులై ఉండి.. అమ్మకాలు రూ. 1 కోటి రూపాయల స్థాయిలో ఉన్నాయనుకోండి. కొనుగోళ్లు, ఇతర ఖర్చులు రూ. 98,00,000 అనుకోండి. దీన్ని బట్టి చూస్తే మీ నికర ఆదాయం రూ. 2,00,000. ఇది బేసిక్‌ లిమిట్‌ లోపల ఉంది కాబట్టి మీరు రిటర్ను వేయనవసరం లేదు. కానీ, 21–4–22 నాడు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రూల్స్‌ మారిపోయాయి. గెజిట్‌ ప్రచురించిన తేది నుంచి అమలవుతుంది. 31–3–22తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ఇక నుండి నికర ఆదాయంతో నిమిత్తం లేకుండా..  

► ఒక వ్యక్తి వ్యాపారంలో అమ్మకాలు, టర్నోవరు, వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 60,00,000 దాటితే.. 

► ఒక వ్యక్తి వృత్తిలో వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10,00,000 దాటితే 

► టీడీఎస్‌ కానీ టీసీఎస్‌ కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 దాటితే 

 బ్యాంకు పొదుపు ఖాతాల్లో (ఒకటి లేదా అంతకు మించి ఉన్నన్ని) జమలు (డిపాజిట్లు) రూ. 50,00,000 దాటితే 

 60 ఏళ్లు దాటిన వారి విషయంలో టీడీఎస్, టీసీఎస్‌ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటితే 

పైన పేర్కొన్న వారు ఇక నుంచి రిటర్నులు విధిగా దాఖలు చేయాలి. ఈ కొత్త రూల్స్‌ వల్ల ఆదాయపు పన్ను శాఖ పరిధిని విస్తరించినట్లవుతోంది. జీఎస్‌టీ చట్టంలో లాగా రిటర్నులు వేయమని దీని ఉద్దేశం. జీఎస్‌టీ చట్టంలో ఏటా రూ. 20,00,000 దాటిన వారికే రిజిస్ట్రేషన్, పన్నులు, రిటర్నులు ఉంటున్నాయి. కానీ వృత్తి నిపుణులకు రూ. 10,00,000లకే మొదలైంది ఈ తతంగం. ఇప్పటిదాకా ఉన్న చట్టాలను మార్చేశారు మార్చేశారు. ఇన్‌కం ట్యాక్స్‌ చట్టం..దాని స్వరూపంతో పాటు స్వభావాన్నీ మార్చుకుంటోంది. అయితే, పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు జరిపిన వారి నుంచి ఆశించిన విధంగా చిన్న చిన్న వృత్తుల వారి నుంచి, వ్యాపారస్తుల నుంచి ఆశించటం సబబు కాదనిపిస్తోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top