ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఈ పనులు తప్పక చేయండి..లేదంటే!

Do First On This Financial Year - Sakshi

గత ఆర్థిక సంవత్సరాంతంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదించింది. బిల్లు కాస్తా చట్టమైంది. చేర్పులో.. మార్పులో.. కూర్పులో.. వెరసి .. చట్టం అమల్లోకి వచ్చేసింది. ఈ మధ్య ప్రతి రోజూ పేపర్లలో నాలుగు ముఖ్యమైన అంశాలు, ఐదు విశేషాలు, ఆరు అమల్లోకి, ఏడు మార్పులు.. పది నిబంధనలూ అంటూ ఎన్నో వ్యాసాలు వరుసగా వచ్చాయి. నంబరుతో పని లేకుండా మీరు ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయవలసింది ఏమిటంటే.. 

► ఇప్పటివరకూ చేసుకోకపోతే వెంటనే పాన్‌తో ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకోండి. అలా చేసుకోకపోతే ముందు ముందు ఆర్థిక వ్యవహారాలను స్తంభింపచేస్తారు. పెనాల్టీ పడుతుంది. ఈసారి ఇక వాయిదా ఇవ్వరు. 

► 31–3–2022తో ముగిసిన సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు తేదీ 31–07–2022 అని మర్చిపోకండి. గత రెండు సంవత్సరాలు కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో పెద్ద పెద్ద వాయిదాలిచ్చారు. ఖచ్చితంగా ఈసారి వాయిదాలుండవు. 

► మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డిపార్ట్‌మెంట్‌ ఈసారి ఏప్రిల్‌ మొదటి వారంలోనే అన్ని ఫారంలను నోటిఫై చేసింది. సులువైన, సరళమైన ప్యాకేజీలు అమలు చేసింది. ఏ క్షణంలోనైనా ఎనేబుల్‌ చేస్తుంది. అలా అయింది అంటే ఆట మొదలైందన్నమాటే. 

► కొత్తగా ’రివైజ్‌ రిటర్ను’ పట్టుకువచ్చారు. గతంలో ఏదైనా ఖర్చు అంటే .. పన్ను, వడ్డీలు కడితే వేసుకోవచ్చు. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం తక్కువగా చూపి ఉంటే .. ఇప్పుడు మర్చిపోయిన ఆదాయాన్ని చూపిస్తూ .. పన్ను, వడ్డీ అదనంగా 25 శాతం లేదా 50 శాతం చెల్లించి రివైజ్‌ రిటర్ను వేసుకోవచ్చు. రివైజ్‌ చేసినప్పుడు ఆదాయం తగ్గితే ఒప్పుకోరు. 

►క్రిప్టో ఆస్తుల మీద పన్ను, భవిష్య నిధిలో జమ రూ. 2,50,000 దాటితే వచ్చే వడ్డీ మీద పన్ను, అదనపు టీడీఎస్‌ వసూలు.. ఇలాంటివన్నీ కొత్త బరువులు. 

► కోవిడ్‌ ఖర్చుల నిమిత్తం వచ్చిన మొత్తం, కోవిడ్‌ వల్ల మృత్యువాత పడినందుకు వచ్చే పరిహారం, ఉద్యోగస్తులకు కొత్త పెన్షన్‌ స్కీమ్‌ జమలపరమైన మినహాయింపులు.. ఇవన్నీ ఉపశమనాలు. 

► నోటీసులు ఎప్పుడైనా రావచ్చు. చకోర పక్షుల్లాగా రోజూ మీ ఈమెయిల్‌ బాక్సును గమనించండి. వెంటనే జవాబు ఇవ్వండి. అశ్రద్ధ వద్దు. కొన్ని చిన్న చిన్న వివరణల వల్ల .. సవరణల వల్ల సమస్య సమసిపోతుంది. కొన్నింటికి రుజువులు ఇవ్వాలి. స్క్రూటినీ అయితే .. బాగా ప్రిపేర్‌ అవ్వాలి. తగినంత సమయం ఇస్తారు. అలుసు తీసుకుని జాప్యం చేయొద్దు. ఫేస్‌లెస్‌ రోజులివి! 

►ఈ మధ్య డాక్టర్ల విషయంలో బుక్స్‌ రాయలేదని పెనాల్టీలు వేశారు. ఉద్యోగస్తులు అవసరం లేదు. ఇతరులు బుక్స్‌ రాయండి. ఇప్పుడు ఎన్నో అకౌంటింగ్‌ ప్యాకేజీలు ఉన్నాయి. రుజువులు భద్రపర్చుకోండి. జీఎస్‌టీ చట్టప్రకారం నడుచుకోండి. 

► ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్లానింగ్‌ ఆలోచించండి. ఆస్తి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆస్తుల పంపకం, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, వ్యాపారం చేయాలన్నా.. పెద్ద పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్‌ చేయాలన్నా.. ఆలోచించి అడుగేయండి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top