
పైన ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తికి బ్యాంకింగ్ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉందట. కానీ ప్రస్తుతం నిలువ నీడ లేకుండా, చేతిలో చిల్ల గవ్వ లేకుండా రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్నాడు. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది జాబ్ మార్కెట్, సామాజిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.
రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఆ వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, ఒక రెడ్డిటర్ ఇలా రాసుకొచ్చారు..‘ఈ వ్యక్తిని ఒక ప్రముఖ బెంగళూరు సిగ్నల్ వద్ద చూశాను. ఆయనను చూస్తే ఎంతో హృదయవిదారకంగా ఉంది. ఇది సమాజ వైఫల్యమా లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.’
రెడ్డిటర్ షేర్ చేసిన ఫొటోల్లో మొదటి దాంట్లో ఆ వ్యక్తిని రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై బిచ్చగాడిలా కనిపించారు. రెండో ఫొటోలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న నోట్‌ను చూపించారు. అందులో 'నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, దయచేసి సహాయం చేయండి. నాకు బ్యాంకింగ్ లో 14 ఏళ్ల అనుభవం ఉంది’ అని రాసిఉంది.
ఈ పోస్ట్‌పై రెడ్డిటర్స్ మధ్య చర్చ సాగింది. బెంగళూరు వంటి నగరంలో నిరుద్యోగం ఏంటి అని కొందరు ప్రశ్నించారు. అయితే అతని శారీరక వైకల్యం ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'శారీరకంగా సామర్థ్యం ఉంటే డెలివరీ లేదా డ్రైవింగ్ వంటి ఏదో ఒక పని చేసుకోవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉంటే, మానసికంగా విచ్ఛిన్నమై, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.