
‘డ్రాగన్’ కాసులు!
ఏడెకరాల రాళ్ల భూమిలో రైతు వెంకటేశ్వరరావు ప్రయోగం
● నాటిన 20 నెలల్లో ప్రారంభమైన డ్రాగన్ పండ్ల దిగుబడి ● తొలి కాతలో ఎకరాకు ఐదు టన్నుల కాయలు ● టన్ను డ్రాగన్ పండ్లకు రూ. లక్ష ఆదాయం
అశ్వారావుపేటరూరల్: రాళ్లభూమిలో ఓ రైతు ధైర్యంతో సాగు చేసిన డ్రాగన్ పంట కాపునకు వచ్చింది. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామ శివారులో రైతు బిర్రం వెంకటేశ్వరరావు తన ఏడెకరాల చేలో దాదాపు ఇరవై నెలల క్రితం డ్రాగన్ తోట సాగు చేశాడు. ప్రయోగాత్మకంగా, లక్షలాది రూపాయాల పెట్టుబడితో సాగు చేపట్టాడు. దిగుబడి మొదలుకాగా రైతు మోములో ఆనందం వ్యక్తమవుతోంది.
ఎకరానికి ఐదు టన్నులు..
డ్రాగన్ తోటకు ఒక్కసారి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే దాదాపు ఇరవై ఏళ్లవరకు దిగుబడి వస్తుంది. పంట సాగుకు ఒక ఎకరానికి సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల దాకా ఖర్చు అవుతుండగా, ఎకరానికి దాదాపు నాలుగు వేల డ్రాగన్ మొక్కలు నాటుకోవచ్చు. ఎకరాకు 500 సిమెంట్ స్తంభాలు అవసరం కాగా, ఒక్కో స్తంభానికి 10 మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలకు డ్రిప్ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉండగా, ఈ పంట సాగుకు నీరు పెద్దగా అవసరం లేదు. పంట సాగు చేసిన 18 నెలల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైంది. ఏటా జూన్ మాసంలో పంట దిగుబడి మొదలై నవంబర్ వరకు ఉంటుంది. తొలిసారి పంట దిగుబడిగా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు కాయలు దిగుబడి వచ్చాయి. తొలి ఏడాది దిగుబడి తక్కువ వచ్చినా రెండో ఏడాది నుంచి దిగుబడి రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కాగా, మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్ టన్ను ధర రూ.లక్ష వరకు ఉంది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో లాభదాయకంగా మారింది. డ్రాగన్ పండ్లను అశ్వారావుపేట, సత్తుపల్లి, ఏపీలోని విజయవాడ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నామని, తోట వద్ద కేజీ రూ.150కు విక్రయిస్తున్నామని రైతు తెలిపాడు.
మార్కెటింగ్‌కు ఇబ్బందే..
పంట సాగుకు రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. అయినా ఆసక్తి ఉండటంతో ముందుకు సాగా. ప్రస్తుతం మార్కెట్‌లో డ్రాగన్ పండ్లకు డిమాండ్ ఉంది. కానీ విక్రయాలకు కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి. కాయల కోత తర్వాత మూడు రోజుల్లోనే విక్రయించాలి. లేనిపక్షంలో కాయ దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దూర ప్రాంతాలకు రవాణా చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – బిర్రం వెంకటేశ్వరరావు,
ఆసుపాక, అశ్వారావుపేట మండలం

‘డ్రాగన్’ కాసులు!

‘డ్రాగన్’ కాసులు!

‘డ్రాగన్’ కాసులు!