
మెలకువలతోనే వ్యాపారాభివృద్ధి
భద్రాచలంటౌన్: గిరిజన యువత మెలుకువలు తెలుసుకుని వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతులతో మాట్లాడారు. అనంతరం పీఎంఆర్సీ కార్యాలయాన్ని, శ్రీరామ జాయింట్ లయబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్‌ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభిరుచికి తగినట్లు దుస్తులు డిజైనింగ్ చేయాలని, ముక్కోటి, శ్రీరామనవమి పండుగల సమయాల్లో దుస్తుల విక్రయాలకు వెసులుబాటు కల్పిస్తానని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పిస్తామని, కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు ఎంబ్రాయిడరీ మిషన్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రకాల సంక్షేమ పథకాల పెయింటింగ్ డిజైనింగ్ వేయించాలని పీఎంఆర్సీ సిబ్బందికి సూచించారు. మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయి వరకు తీసుకెళ్లి ఐటీడీఏ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు ఇక్కడి పొలాల్లోనే పండించుకోవాలని సూచించారు. అనంతరం మిల్లెట్ బిస్కెట్ తయారీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతగా పీఓ బి.రాహుల్, ఏఎస్పీ, విక్రాంత్ కుమార్ సింగ్, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మలకు మహిళలు మిల్లెట్ బిస్కెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, ఈఈ హరీష్, ఏసీఎంఓ రమేష్, శ్రీనివాస్, ఆదినారాయణ, నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మిల్లెట్ బిస్కెట్ తయారీదారులు వెంకటలక్ష్మి, లలిత, మంగ వేణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం
భద్రాచలంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కళాశాల, లయన్స్ క్లబ్, వికాస తరంగిణిల అధ్వర్యంలో ఆదివారం నర్సింగ్ కళాశాలలో ఉచిత కేన్సర్ నిర్ధారణ, చికిత్స, నేత్ర శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, సికిందరాబాద్‌కు చెందిన పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించగా, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణకు శిబిరాలు దోహదం చేస్తాయని అన్నారు. 650 మందికి కంటి చూపు పరీక్షలు నిర్వహించి, 326 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. పలువురికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ కె.దామోదర్‌రావు, ఎంవీఐ వెంకట పుల్లయ్య, రెడ్‌క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కాంతారావు, ఎ.జగదీష్, డాక్టర్ బి. సుబ్బరాజు, డాక్టర్ జయభారతి, కేన్సర్ వైద్య నిపుణులు, ప్రజ్ఞా, కమలా రాజశేఖర్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్