
ఘనంగా జగన్నాథ రథయాత్ర
అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒడిశాలో జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో 26 సంవత్సరాలుగా గౌతమినగర్‌లో వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం. ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు తొలిరోజు ఆధ్యాపూజ, మధ్యాహ్నపూజ, పహాండి, ఛెరపహారా తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ దేవతా మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మండపంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు వేడుకలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఛెరపహారా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులు కొలువైన రథాన్ని భక్తులు ఇరువైపులా బారులుదీరి లాగారు. ఆ తర్వాత గుండిచాఘర్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ఒడిశావాసులు, భారజల కర్మాగార ఉద్యోగులు, అశ్వాపురం పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈ వేడుకలు 9 రోజులపాటు సాగనున్నాయి.
గౌతమీనగర్ కాలనీలో సందడి