
గోదావరి వరదలతో అప్రమత్తంగా ఉండాలి
భద్రాచలంటౌన్: గోదావరికి గతేడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఆర్టీఓ దామోదర్ రావు అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం డివిజన్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ముంపునకు గురయ్యే ఏజెన్సీ గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంత గ్రామాలను గుర్తించి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రధానంగా ఏడు ముంపు మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. మత్స్యశాఖ అధికారులు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మళ్లీ నిర్వహించే సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి ప్రణాళికలు తయారు చేసుకుని రావాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, జిల్లా, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో ఆర్డీఓ దామోదర్‌రావు