
ఏటీఎం కార్డు చోరీ..
టేకులపల్లి: సహాయం చేస్తున్నట్లు నమ్మించిన ఓ వ్యక్తి.. ఏటీఎం కార్డు చోరీచేసి, అందులోని రూ.31 వేలు డ్రాచేసిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎలక్ట్రానిక్స్, నెట్ సెంటర్ నిర్వాహకుడు యదళ్లపల్లి బాలకృష్ణ శుక్రవారం తన దుకాణంలో పనిచేసే పూనెం తేజకు తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని రావాలని పంపించాడు. సూర్యతేజ ఏటీఎంలో డబ్బులు తీస్తున్న క్రమంలో అదే సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తేజను తికమకపెట్టి అలా కాదు ఇలా అంటూ చెప్పి.. కార్డు మార్చేసి వేరే కార్డుని తేజకు ఇచ్చారు. తిరిగి సూర్యతేజ ఏటీఎం కార్డును యజమానికి ఇవ్వగా ఆ కార్డు తనది కాదని గుర్తించి వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. కొద్ది సేపటికే ఇల్లెందు సుదిమళ్ల ఏటీఎం వద్ద రూ.31 వేలు డ్రా చేసినట్లు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రైతుల కోసం పొలం బాట
● జిల్లా విద్యుత్ సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్.కృష్ణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా విద్యుత్ సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్, డివిజనల్ ఇంజనీర్(టెక్నికల్) ఎన్.కృష్ణ శుక్రవారం తెలిపారు. వంగిన పోల్‌లు, లూజ్ లైన్లను సరిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పొలం బాటలో వంగిన పోల్‌లు 1,215, లూజ్‌లైన్లు 1,255, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెలు 149 మార్చినట్లు వెల్లడించారు. విద్యుత్ మోటార్లు వినియోగించేపుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ పంపుసెట్లకు విధిగా ఎర్తింగ్ చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అయితే వెంటనే రైతులు 1912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, 48 గంటలు దాటి ఆలస్యమైందని గుర్తిస్తే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటారని స్పష్టం చేశారు.
దామరచర్లలో
డెంగీ కేసు నమోదు
చండ్రుగొండ: మండలంలోని దామరచర్ల గ్రామంలో డెంగీ కేసు నమోదైంది. కంచు బీరయ్య కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా శుక్రవారం పీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా తేలిందని డాక్టర్ కె.తనూజ వెల్లడించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శితోపాటు సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సత్వర చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతోపాటు కాల్వలు శుభ్రం చేయించారు.

ఏటీఎం కార్డు చోరీ..