వరుస తుఫాన్‌లతో అల్లాడిపోతున్న ఉప్పు రైతు గడచిన మూడు సీజన్‌లుగా నష్టాలు ఈ సీజనలోనూ ప్రశ్నార్థకం మోంథా తుఫాన్‌తో నీట మునిగిన ఉప్పు కొఠారులు నెల రోజులు దాటినా కొఠారుల్లో తొలగని వర్షపు నీరు మొన్న మోంథా, నేడు దిత్వా దెబ్బ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అగమ్యగోచరంగా పరిస్థితి
చినగంజాం: ప్రతి ఏడాది నవంబరు మొదటి వారంలో ఉప్పు సాగు పనులు ప్రారంభించి జూన్ నెల వరకు కొనసాగిస్తారు. మొదటి రెండు నెలలు కొఠారు భూములు సాగుకు సిద్ధం చేసుకునేందుకు, తరువాత ఆరు నెలలపాటు ఎండలు తీవ్రతను బట్టి ఉప్పు సాగు అవుతుంది. నవంబరు నెల కార్తిక మాసంలో సాగు ప్రారంభించి సంక్రాంతి పండుగ నాటికి రైతులు మొదటి ఉప్పు తీత తీస్తారు. అలాంటిది ఇప్పటికీ సాగు ప్రారంభం కాకపోవడంతో రైతు డీలా పడిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో నాగులుప్పలపాడు మండలం కనపర్తి, కొత్తపట్నం మండలం కొత్తపట్నం, సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం, బాపట్ల జిల్లాలో ఒక్క చిన్నగంజాం మండలంలోనే ఉప్పు సాగు అవుతుంది. వీరిలో సన్న, చిన్న కారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. గత మూడు సీజన్‌లుగా ప్రకృతి వైపరీత్యాలతో పూర్తి స్థాయిలో ఉప్పు సాగు చేయలేక పోయారు. గత సీజన్‌లో అడపాదడపా సాగుతో తీసిన ఉప్పును గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేని పరిస్థితిలో కువ్వలు పోసి భద్రం చేసుకున్నారు. వాటిని అమ్ముకోలేక కాపాడుకోలేక అల్లాడిపోతున్నారు.
వేల ఎకరాల్లో నిలిచిన సాగు
ఈ ఏడాది సీజన్‌లో వరుస తుఫాన్‌లతో సాగు మొదలు పెట్టేందుకు ఉప్పు రైతులు జంకుతున్నారు. సీజన్ ప్రారంభించాల్సిన నవంబర్ మొదటి వారంలో మోంథా తుఫాన్, డిసెంబర్ మొదటి వారంలో దిత్వా తుఫాన్‌లతో సాగుకు పూర్తి ఆటంకం ఏర్పడింది. మోంథా తుఫాన్‌తో కొఠారు భూములు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోగా.. ఆ నీరు బయటకు వెళ్లగొట్టక ముందే దిత్వా తుఫాన్ వచ్చిపడటంతో రైతులకు సాగు అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊళ్ళపాలెం, కనపర్తి, కొత్తపట్నం, చినగంజాంలలో ఉప్పు సాగు నిలిచిపోయింది. బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలోని చినగంజాం, పెదగంజాంలో మొత్తం 3 వేల ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. అందులో ప్రభుత్వ భూమి 1800, ప్రైవేట్ భూమి 1200 ఎకరాలు ఉన్నాయి. వీటిలో చిన్న, సన్న కారు రైతులు సుమారు 750 కుటుంబాల వారితో పాటు ఉప్పు కొఠారులలో పనులు నిర్వహిస్తూ కూలీలుగా సుమారు 8 వేల మంది పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సింగారాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామ పరిధిలో రెండు సొసైటీలు, కొత్తపట్నం గ్రామ పరిధిలో ఒక సొసైటీ నడుస్తున్నాయి, ఉళ్ళపాలెం గ్రామ పరిధిలో ఎస్సీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద 500 ఎకరాలు, ఓసీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద మరో 350 ఎకరాల ఉప్పు సాగు అవుతోంది. కొత్తపట్నం మండలంలోని సాల్ట్ సొసైటీ కింద 275 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. వీటితో పాటు సుమారు మరో 1000 ఎకరాల ప్రైవేట్ భూముల్లో రైతులు సాగు కొనసాగిస్తున్నారు. మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల ఉప్పు సాగు తుఫాన్‌ల ధాటికి నిలిచిపోయింది.
ఉప్పు రైతులకు కొన్ని సీజన్‌లుగా కాలం కలిసి రావడం లేదు. ప్రకృతి అనుకూలత లేక సాగు ముందుకు సాగడం లేదు. భారీ వర్షాలు, అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్‌లు వంటి ప్రకృతి వైపరీత్యాలు కారణంగా వరుసగా సాగు కుంటు పడుతోంది. ఉప్పు సాగు పూర్తిగా సూర్యరశ్మి ఆధారిత పంట కావడంతో పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.
‘ఉప్పు’ రైతు విలవిల


