కిలాడీ కన్నేస్తే సొత్తు మాయం
బాపట్ల: బాపట్ల జిల్లాలో పలు బస్టాండ్‌లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను ఇంకొల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... నెల్లూరు జిల్లా కావలికి చెందిన కర్రేదుల లలిత అలియాస్ లిల్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ప్రత్యేక బృందాలతో చెక్
ఇటీవల కాలంలో జిల్లాలోని బస్టాండ్‌లలో మహిళా ప్రయాణికులను దృష్టి మరల్చి, వారి లగేజీలలో దాచుకున్న పర్సులు, బంగారు ఆభరణాలను దొంగిలించే కేసులు ఎక్కువ కావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్ పర్యవేక్షణలో ఇంకొల్లు సీఐ వై.వి. రమణయ్య, ఎస్‌ఐ జి. సురేష్ బృందాలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా మంగళవారం ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిందితురాలిని అరెస్టు చేశారని తెలిపారు. బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట వన్ టౌన్, కాకినాడ జిల్లాలోని తుని పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు ఆమె అంగీకరించినట్లు పేర్కొన్నారు. 5 కేసులలో రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆమె నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితురాలిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కేసులు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, విజయవాడ సిటీ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, కడప, వరంగల్ తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడింది. చివరిసారిగా 2020లో వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమైపె ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 3 కేసులున్నాయి. ఇంకొల్లు సీఐ, ఎస్‌ఐలతోపాటు హెడ్ కానిస్టేబుళ్లు బి.అచ్చయ్య, జి.ప్రసాద్, కానిస్టేబుళ్లు సి.హెచ్ రత్నరాజు, ఎ.రామి రెడ్డి, బి.బాలచంద్ర, ఆర్.నాగలక్ష్మిలను ఎస్పీ అభినందించి, క్యాష్ రివార్డులను అందజేశారు.


