స్ఫూర్తిని నింపేలా పీటీఎం నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిని నింపేలా పీటీఎం నిర్వహణ

Dec 3 2025 8:05 AM | Updated on Dec 3 2025 8:05 AM

స్ఫూర్తిని నింపేలా పీటీఎం నిర్వహణ

స్ఫూర్తిని నింపేలా పీటీఎం నిర్వహణ

జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వసనీయత, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి ఈనెల ఐదో తేదీన మెగా పీటీఎం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ బడులు బాగుంటేనే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు. 1,405 పాఠశాలలు, 19 జూనియర్‌ కళాశాలలో పీటీఎం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాలకు తల్లిదండ్రులు ఇరువురు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ఎం ద్వారా విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్‌ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 35 శాతం పూర్తయిందని, రానున్న రెండు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ప్రతిభావంతులను మరింత మెరుగుపరచడానికి, కొద్దిగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈ ప్రక్రియ ద్వారా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం వందరోజుల వార్షిక ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి గజిటెడ్‌ ఆఫీసర్‌కు కొన్ని పాఠశాలలు కేటాయిస్తామన్నారు. వారు ఆ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే కార్యక్రమం చేపడతామన్నారు.

ధాన్యం సేకరణలో పారదర్శకతతో ఉండాలి

ధాన్యం సేకరణ బాపట్ల జిల్లాలో పారదర్శకతతో సాగుతోందని కలెక్టర్‌ చెప్పారు. 7600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేశామన్నారు. డిసెంబర్‌ రెండో వారం నుంచి వరి పంట కోత మరింతగా పెరుగుతోందని, ఆ సమయంలో ధాన్యం సేకరణ సమర్థంగా చేపడతామన్నారు. ధాన్యం సేకరణ కోసం 2,500 టార్పాలిన్‌ పట్టలు కొనుగోలు చేశామని, వాటిని రైతు సేవా కేంద్రాలకు ఇచ్చామన్నారు. ధాన్యం తడవకుండా భద్రపర్చడానికి గోదాములు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

కోర్టు కేసులపై అప్రమత్తంగా ఉండాలి

కోర్టు కేసులపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ కలెక్టరేట్‌ సిబ్బందికి సూచించారు. కలెక్టర్‌ కార్యాలయం సిబ్బందితో మంగళవారం ఆయన స్థానిక న్యూ వీసీ హాల్‌లో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కేసులను నిశితంగా పరిశీలించిన తదుపరి వాటికి దస్త్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. భూ సేకరణకు సంబంధించిన కోర్టు కేసులలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అధ్యయనం చేయాలి, అవగాహన పొందాలని అన్నారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్‌ షఫీ, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ యశ్వంత్‌, వెబ్‌ ల్యాండ్‌ ఇడియం కుమార్‌ రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

నూతన వంగడాలు అభినందనీయం

జీడి మామిడిలో నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. జీడిమామిడి పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. జీడి మామిడి అంటుమొక్కల ఉత్పత్తి నర్సరీని ఆయన పరిశీలించారు. పరిశోధన కేంద్రాల్లో లాబొరేటరీ పరికరాలు, పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జీడి మామిడి నూతన వంగడాలపై జరుగుతున్న ప్రయోగాలను ఆయన పరిశీలించారు. జీడి విత్తనాలను పరిశీలించారు. మోంథా తుపాను సమయంలో భారీ వర్షాలకు కూలిన పరిశోధన కేంద్రం ప్రహరీని ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కూలీలతోనూ ఆయన మాట్లాడారు. జీడి మామిడిలో ఉత్పత్తులు పెరిగేలా ప్రయోగాలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. బాపట్ల పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసే అంటుమొక్కలను శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం, అటవీ శాఖ కార్పొరేషన్‌కు పంపుతున్నామని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఒక్కొక్క మొక్క రూ.50లకు విక్రయిస్తున్నామని కలెక్టర్‌కు వివరించారు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాల ఫలాలను రాష్ట్రవ్యాప్తంగా అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement