చేనేత పరిశ్రమ కుదేలు
ప్రభుత్వాల నిర్లక్ష్యంతో
చీరాల రూరల్: కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నాయని, చేనేత వృత్తిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం భూమిని కేటాయించి ఆదుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం చీరాలలోని పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం చేనేత రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా డాక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల జనాభా అంతా ఏదో ఒక వృత్తి చేసుకుని జీవనం పొందుతుండగా యాజమాన్య కులాలకు వృత్తి లేకుండా కేవలం రాజకీయాలనే వృత్తిగా చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో రెండే కులాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలోని గచ్చిబౌలి ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని, అక్కడ చేనేతలు కూడా ఉన్నారని వారు ఏమైనా అభివృద్ధి చెందారా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోని అమరావతి అభివృద్ధి చెందిందని చెబుతున్నారు కానీ అమరావతికి దగ్గరలో చేనేతలు ఉన్న మంగళగిరి ఏమైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. హైదరాబాదులోని చేనేతలు ఎక్కువగా ఉండే సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌లో చేనేతలు ఎక్కువగా ఉండే మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎమ్మెల్యే అయినప్పటికి చేనేతల బతుకులు మాత్రం మారడంలేదన్నారు. ఎక్కడైనా భూములు ఉన్నవారే అభివృద్ధి చెందుతున్నారు కానీ భూములులేని చేతి వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న నిరుపేదలు ఎప్పటికీ అభివృద్ధి చెందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత జన సమాఖ్య రాష్ట్ర నాయకుడు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చేనేత వృత్తికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చేనేతల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ఆయన ఎన్నికల అనంతరం చేనేతలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడిన చేనేతలంతా కలిసి ఉద్యమ కార్యచరణ ప్రకటించాలని కోరారు.
డిమాండ్లు ఆమోదించాలి..
సదస్సులో చేనేతలకు సంబంధించిన డిమాండ్లు ఆమోదించాలని మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత సొసైటీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి సొసైటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. చేనేత ఉత్పత్తుల 11 వస్త్రాల రిజర్వేషన్ అమలు చేయాలని, చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, చేనేత పరిశ్రమకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని, చేనేత మగ్గాలను ఆధునీకరించి శారీరక శ్రమ తగ్గించాలని, చేనేతలకు, షెడ్డు కార్మికులకు రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించి, రంగులు, రసాయనాలు నూలుపై 50 శాతం సబ్సి డీ ఇవ్వాలని, చేనేత ఉత్పత్తి దారులకు జాతీయ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించాలని, చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. డిమాండ్లు సాధనకు ఒక రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ తాత్కాలిక కన్వీనర్‌గా మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణను ఎంపిక చేశారు. ఏపీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు, చుండూరి వాసు, జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ బూదాడ రాజయ్య, డాక్టర్ హైమా సుబ్బారావు, ఆకురాతి మురళి, ఎస్‌ఎన్ భగత్ సింగ్, వెంకటేశ్వరమ్మ, శీలం రవి, ఆకురాతి పద్మిని, గొర్రెపాటి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో భూములున్నవారికే రాజధానిలో లబ్ధి చేకూరింది, చేనేతలకు ఎటువంటి లాభం లేదు
తెలంగాణలో హైదరాబాదు అభివృద్ధి చెందినా సిరిసిల్ల అభివృద్ధి చెందలేదు
ఏపీలో అమరావతి అభివృద్ధి చెందినా మంగళగిరి, చీరాల అభివృద్ధి ఊసేలేదు
చేనేత రాష్ట్ర చేనేత సదస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్
పూర్ణచంద్రరావు


